
ఖురాన్ ప్రకారం ఈరోజు కాలినడకన ఈద్గాకు వెళ్లి ప్రార్థన చేయాలి. ప్రార్థనల అనంతరం తిరిగి వచ్చే దారి కూడా వేరుగా ఉండాలి. మనస్సులో అల్లాహ్ నామాన్ని స్మరిస్తూ ఇతర విషయాల గురించి ప్రస్తావించకుండా ముస్లింలు ఈద్గాకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రతి ముస్లిం సోదరుడు ఈద్గాకు వెళ్లి అక్కడ జరిగే ప్రార్థనల్లో కచ్చితంగా పాల్గొనాలి. ఈద్గాకు చేరిన తర్వాత మత పెద్దలు చెప్పిన విధంగా ప్రార్థనలు చేస్తే అల్లాహ్ దయ ఉంటుంది.
ఉపవాస దీక్షలు పూర్తి చేసిన వాళ్లు పాయసం స్వీకరించి ఈద్గా వద్దకు పయనం కావాలని ఖురాన్ చెబుతోంది. అందువల్ల ముస్లిం సోదరులు సైతం ఇంటి దగ్గర ఖర్జూరం, పాయసం తిని వెళ్లడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. రంజాన్ మాసంలో చేసిన దానాలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ దానాలలో జకాత్, ఫిత్రా అనే రకాలు ఉంటాయి.
జకాత్ అంటే సాంవత్సరిక ఆదాయంలో 2.5 శాతం దానం చేయాల్సి ఉంటుంది. తిండికి, బట్టకు నోచుకోని వాళ్లకు ఫిత్రా దాన ధర్మాలు చేస్తారు. ఫిత్రా దానంలో గోధుమలు, ఆహార ధాన్యాలను దానం చేయడం జరుగుతుందని చెప్పవచ్చు. ఇంటి పెద్ద కుటుంబం తరపున ఈ దానాలు చేయడం జరుగుతుంది. రంజాన్ మాసంలో దాన ధర్మాలు చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని ముస్లిం సోదరులు విశ్వసిస్తారు. రంజాన్ పండగను తెలుగు రాష్ట్రాల్లోని ముస్లిం సోదరులు గ్రాండ్ గా జరుపుకొంటున్నారు.