ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏదంటే.. నిస్సందేహంగా పెండింగ్ బిల్లుల చెల్లింపుల వ్యవహారమే. ఐదేళ్ల పాటు జగన్ సర్కార్ బిగించిన ఆర్థిక ఉచ్చు నుంచి బయటపడుతూ.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన మార్క్ పాలనతో దూసుకుపోతున్నారు. ముఖ్యంగా, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు చేసి, బిల్లుల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన పార్టీ శ్రేణులు, కాంట్రాక్టర్లకు ఇప్పుడు నిజంగా పండగ వాతావరణం నెలకొంది. బాబు సర్కార్ ఖజానా తలుపులు తెరిచి, నిధుల వరద పారిస్తోంది.

2019 తర్వాత టీడీపీ హయాంలో చేపట్టిన నీరు-చెట్టు, ఉపాధి హామీ వంటి కీలక పథకాల పనులకు సంబంధించిన వేల కోట్ల బిల్లులు ఒక్కసారిగా ఆగిపోయాయి. చేసిన పనులకు డబ్బులు రాక, కాంట్రాక్టర్లు, ముఖ్యంగా టీడీపీ సానుభూతిపరులుగా ముద్రపడిన వారు పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కొందరైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఆర్థికంగా చితికిపోయిన దుస్థితి. అలాంటి వారందరికీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అభయహస్తం అందిస్తోంది. అప్పటి బకాయిలన్నింటినీ దశలవారీగా క్లియర్ చేస్తూ.. పార్టీ కేడర్‌కు భరోసా కల్పిస్తోంది.

ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. పెండింగ్ బిల్లుల చెల్లింపులో చిన్న కాంట్రాక్టర్లకే పెద్ద పీట వేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తొలి విడతగా సుమారు రూ.2000 కోట్ల విలువైన బిల్లులను విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ నిధులతో దాదాపు 17,000 మంది లబ్ధిదారులకు ఊరట లభించనుంది. వీరిలో 9,000 మంది చిన్న కాంట్రాక్టర్లు కాగా, మరో 8,000 మంది నీరు-చెట్టు పథకం కింద పనులు చేసిన వారు ఉన్నారు. అంటే, సింహభాగం నిధులు అట్టడుగు స్థాయి కార్యకర్తలు, చిన్న కాంట్రాక్టర్లకే చేరనున్నాయన్నమాట. ఇది కచ్చితంగా క్షేత్రస్థాయిలోని 'తమ్ముళ్ల'కు బాబు ఇస్తున్న బిగ్ గిఫ్ట్ అనే చెప్పాలి.

ఈ రూ.2000 కోట్ల విడుదలలో ఓ కీలకమైన వ్యూహం కనిపిస్తోంది. మొత్తం నిధుల్లో ఏకంగా 90 శాతం చిన్న కాంట్రాక్టర్లకే కేటాయించారు. అంటే సుమారు రూ.1800 కోట్లు వీరి ఖాతాల్లోకే వెళ్లనున్నాయి. మిగిలిన 10 శాతం, అంటే రూ.200 కోట్లు మాత్రమే పెద్ద కాంట్రాక్టర్లకు అందనున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన వేలాది మంది చిన్న కాంట్రాక్టర్లు, కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది.

ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారంలో మరో ఆసక్తికరమైన కోణం కూడా ఉంది. నెలాఖరులో ఈ చెల్లింపులు చేయడం వల్ల ప్రభుత్వానికి జీఎస్టీ రూపంలో తిరిగి ఆదాయం సమకూరుతుంది. గత నెలలో రాష్ట్ర జీఎస్టీ వసూళ్లు ప్లస్ 4 శాతంగా నమోదవడానికి ఇలాంటి చెల్లింపులే కొంతవరకు కారణమని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు ఈ రూ.2000 కోట్ల చెల్లింపుతో ఈ నెల కూడా జీఎస్టీ వృద్ధి రేటు పాజిటివ్‌గానే, బహుశా ప్లస్ 4 లేదా ప్లస్ 5 శాతానికి చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అంటే, తమ్ముళ్లకు బిల్లులు చెల్లించినట్లు అవుతుంది, అదే సమయంలో ప్రభుత్వ ఖజానాకు జీఎస్టీ రూపంలో ఎంతో కొంత తిరిగి వస్తుంది. ఇదీ చంద్రబాబు మార్క్ ఆర్థిక వ్యూహం.

మరింత సమాచారం తెలుసుకోండి: