
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. రాజకీయంగా ఇప్పుడు తీవ్రమైన సంకట స్థితిలో ఉన్నారు. నొక్కిన బట్టన్‌లు, తొక్కిన గడపలు, వచ్చిన వాలంటీర్లు, తెచ్చిన గ్రామ సచివాలయాలు, పంచిన నవరత్నాలు, పెట్టిన మూడు రాజధానులు, నియమించిన సలహాదారులు, అర్థం లేని నినాదాలు, అవసరం లేని విమర్శలు.. ఇలా ఐదేళ్ల వైసిపి పాలనలో జగన్ చేసిన మంచి పనులతో పాటు తప్పులు కూడా చాలానే ఉన్నాయి. ఎవరి ఖాతాలో ఓట్లు పోయాయో.. మా నాయకులు గడపగడపకు మన ప్రభుత్వం అంటూ తొక్కిన గడపలన్నీ.. ఏ పార్టీ గుమ్మానికి పసుపు లద్దాయో అంటూ నేటికీ జగన్ తన ఓటమిని ఒప్పుకోలేకపోతున్నారు.
ప్రత్యర్థి గెలుపు అంగీకరించలేకపోతున్నారు. జగన్ సంక్షేమ పరంగా ఎంత అభివృద్ధి చేసిన.. ఆయన విధానాలతో నేడు వైసిపి కేవలం 11 సీట్లకు పరిమితం అయింది. ఇప్పటికీ జగన్ తన నిర్ణయాలు విధానాలలో చాలావరకు మార్చుకోవటం లేదని.. సొంత పార్టీకి చెందిన నేతల విమర్శలు చేస్తున్నారు. జగన్ ఇంకా చాలా విషయాల్లో ధోరణితో ఉండడంతో ఇప్పుడు వైసీపీ గెలిచినా.. ఆ 11 మంది ఎమ్మెల్యేలు అయినా జగన్ వెంట ఉంటారా అంటే.. కొందరు ఎమ్మెల్యేలు మంచి ముహూర్తం చూసుకొని కండువాలు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని గుసగుసలు వైసిపి వర్గాలలోనే వినిపిస్తున్నాయి. జగన్‌కు తల్లి, చెల్లి ఏనాడో దూరం జరిగిపోయారు.
ఇక వరుసకు మామయ్య అయ్యే బాలినేని శ్రీనివాసరెడ్డి తో పాటు.. ఆళ్ల నాని వంటి వైసిపి వీర విధేయులు కూడా వైసిపిని వదిలి టిడిపి, జనసేన గూటికి చేరిపోయారు. ఇక వైసిపి ఎమ్మెల్సీలలో ఇప్పటికే ఐదుగురు సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. ఇటీవల మర్రి రాజశేఖర్ సైతం రాజీనామా చేశారు. వైసీపీ రాజ్యసభ సభ్యులలో విజయసాయి, మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వంటి నేతల రాజీనామాలతో జగన్‌కు ఊహించని షాక్ తగిలింది.
ఇలా వైసిపి నుంచి రాజీనామాతో బయటికి వచ్చేస్తూ ఉంటే ఇక వైసీపీలో మిగిలేది ఎవరు..? జగన్ వెంట నడిచేది ఎవరు.. సజ్జల, వైవి సుబ్బారెడ్డి, కొడాలి నాని, పేర్నినాని, అంబటి రాంబాబు, రోజా, విడదల రజిని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్‌నాథ్, పెద్దిరెడ్డి అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి వంటి నేతల మాత్రమే వైసీపీలో మిగిలే ఛాన్సులు కనిపిస్తున్నాయి అన్న వాదన కూడా వినిపిస్తోంది.