
గత నెల 24న హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం బయలుదేరిన ప్రవీణ్, మార్గమధ్యంలో కీసర టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. ఆ రోజు సాయంత్రం సరిగ్గా 3 గంటల 52 నిమిషాలకు, టోల్ ప్లాజాకు కేవలం 50 మీటర్ల దూరంలో ఉన్న మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాల కోసం కేటాయించిన ప్రత్యేక లైన్‌లోకి వెళ్లే క్రమంలో, వేగాన్ని అదుపు చేయడంలో విఫలమై ప్రవీణ్ ఒక్కసారిగా బైక్‌తో సహా కిందపడిపోయారు. ప్రమాద తీవ్రతకు ఆ ప్రాంతమంతా దుమ్ము లేచింది. వెంటనే అప్రమత్తమైన టోల్ గేట్ సిబ్బంది పరుగున వచ్చి ప్రవీణ్‌ను పైకి లేపారు.
సిబ్బంది గమనించిన దాని ప్రకారం, ప్రవీణ్ కుడి చేతికి అప్పటికే గాయమై ఉంది. అంతకు గంట ముందే మరో గాయం తగిలిన ఆనవాళ్లు కూడా కనిపించాయని వారు చెబుతున్నారు. ప్రవీణ్ తీవ్ర అస్వస్థతతో, కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నారని, కేవలం సైగలతోనే సమాధానమిచ్చారని సిబ్బంది పేర్కొన్నారు. బండిని పట్టుకునే ఓపిక కూడా లేకపోవడంతో, అక్కడే విశ్రాంతి తీసుకోవాలని సూచించినా ప్రవీణ్ వినిపించుకోలేదని, అనేకసార్లు ప్రయత్నించి బైక్‌ను సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని సాయంత్రం 4.07 గంటలకు టోల్ ప్లాజా దాటి ముందుకు వెళ్లిపోయారని వారు వివరించారు. అప్పటికే ఆయన బుల్లెట్ హెడ్‌లైట్ పగిలిపోయి, సేఫ్టీ రాడ్ వంగిపోయి ఉండటం గమనార్హం.
పోలీసుల లోతుపాతుల్లో మరిన్ని విషయాలు బయటకొస్తున్నాయి. హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు ప్రయాణం ప్రారంభించిన ప్రవీణ్, మధ్యాహ్నం కోదాడలో ఆగి ఓ మద్యం దుకాణంలో ఫోన్ పే ద్వారా రూ. 650 చెల్లించి మద్యం కొనుగోలు చేసినట్లు బలమైన సమాచారం అందింది. ఆ తర్వాతే, కంచికచర్ల – పరిటాల మధ్య తొలిసారి అదుపుతప్పి కిందపడటంతో చేతికి గాయాలయ్యాయని, బుల్లెట్ హెడ్‌లైట్ పగిలిపోయిందని తెలుస్తోంది. రామవరప్పాడు రింగ్ వద్ద కూడా ఆయన పడిపోయినప్పుడు అక్కడున్న ట్రాఫిక్ ఎస్సై సుబ్బారావు, వాహనం డామేజ్‌ను (పగిలిన హెడ్‌లైట్, వంగిన సేఫ్టీ రాడ్లు), ప్రవీణ్ గాయాలను, సొట్టలు పడ్డ హెల్మెట్‌ను గుర్తించి ఫోటోలు, వీడియోలు తీశారు.
గొల్లపూడిలో పెట్రోల్.. విజయవాడలో ప్రయాణం:
అనంతరం గొల్లపూడి చేరుకున్న ప్రవీణ్, ఓ పెట్రోల్ బంకులో ఇంధనం నింపుకున్నారు. అక్కడ రూ. 872 ఫోన్ పే ద్వారా చెల్లించారు. ఆ సమయంలోనూ ప్రవీణ్ తీవ్ర నీరసంగా, మాట్లాడలేని స్థితిలో ఉన్నారని, చేతికి గాయాలు, బైక్ హెడ్‌లైట్ ఊడిపోయి వేలాడుతూ కనిపించిందని బంక్ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. అక్కడి నుంచి విజయవాడ నగరంలోకి ప్రవేశించిన ప్రవీణ్, దుర్గగుడి ఫ్లై ఓవర్, రాజీవ్‌గాంధీ పార్క్, పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్ మీదుగా బెంజిసర్కిల్ రెండో ఫ్లైఓవర్ ఎక్కి మహానాడు జంక్షన్‌కు చేరుకున్నట్లు సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించారు.
ప్రవీణ్ ప్రయాణ మార్గంలోని అనుమానాలను నివృత్తి చేసుకునేందుకు, ముఖ్యంగా విజయవాడలో ఆయన మూడు గంటల పాటు ఎక్కడ ఉన్నారనే చిక్కుముడిని విప్పేందుకు విజయవాడ, రాజమహేంద్రవరం పోలీసులు సంయుక్తంగా దాదాపు 300 సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా విశ్లేషించారు. ఈ క్రమంలోనే ప్రవీణ్ ప్రతి కదలికను, ఆయన ఎదుర్కొన్న అనూహ్య పరిణామాలను గుర్తించగలిగారు. ఈ కేసు విచారణలో ఈ దృశ్యాలు అత్యంత కీలకంగా మారనున్నాయి.