
ప్రభుత్వం ఏం చెబుతోంది?
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వాదన ప్రకారం.. ఈ బిల్లు వక్ఫ్ ఆస్తుల పరిపాలనను మెరుగుపర చనుంది. దేశవ్యాప్తంగా వక్ఫ్ భూముల విషయంలో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాదు.. నేరుగా ప్రభుత్వ జోక్యానికి కూడా వీలుంటుంది. దిగువ స్థాయి కోర్టుల మాట ఎలా ఉన్నా.. రాష్ట్ర, దేశ ఉన్నత న్యాయ స్థానాల్లో వక్ఫ్ బోర్డు నిర్ణయాలను ప్రశ్నించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
అంతేకాదు.. ఈ బిల్లుతో వక్ఫ్ ఆస్తుల డిజిటలైజేషన్ జరుగుతుంది. తద్వారా అక్రమ ఆక్రమణలు, భూ దుర్వినియోగం తగ్గే అవకాశం ఉంది. అదనంగా, ఆడిట్, పర్యవేక్షణ పెరుగుతాయి, తద్వారా వక్ఫ్ బోర్డు తీసుకునే నిర్ణయాల విషయంలో జవాబు దారీ తనం పెరుగుతుంది. ఇకపై వక్ఫ్ ట్రిబ్యునల్ లో కేసులు ఏళ్ల తరబడి పేరుకు పోకుండా.. నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇది అందరికీ మేలు చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది.
మైనారిటీ వాదన ఇలా ఉంది..
అయితే.. ఆది నుంచి కూడా వక్ఫ్ బోర్డు విషయంపై మైనారిటీలు ఆందోళన, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ బోర్డును సవరించేందుకు వీల్లేదని చెబుతున్నారు. వక్ఫ్ బోర్డుల్లో ఇతర మతస్థులను చేర్చడం ఆమోదయోగ్యం కాదని, ముస్లింలు స్వతంత్రంగా నిర్వహించే సంస్థల్లో ఇతర మతాలకు ప్రాతినిధ్యం ఇవ్వడం సరైన పద్ధతి కాదని చెబుతున్నారు. అంతేకాకుండా, ఇప్పటివరకు వక్ఫ్ మాత్రమే వక్ఫ్ ఆస్తులపై నిర్ణయాలు తీసుకునేది, కానీ ఈ బిల్లుతో ప్రభుత్వ అధికారులకు సైతం జోక్యం కల్పించడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు. దీంతోనే వక్ఫ్ బిల్లు వివాదానికి కేంద్రంగా మారింది. అయితే.. ఇది మంచిదేనని కొందరు.. కాదని మరికొందరు కూడా చెబుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందన్నది చూడాలి.