మంగళగిరి నియోజ‌క‌వ‌ర్గం తాడేప‌ల్లి మండ‌లంలోని ఉండవల్లి రజకుల కాలనీలోని కొండవాలు ప్రాంతంలో రాజమండ్రి గోవిందు కుటుంబం గత పదిహేనేళ్లుగా ఇల్లు నిర్మించుకొని జీవనం సాగిస్తోంది. అది కొండ పోరంబోకు కావడంతో ఇప్పటివరకు ఆ ఇంటిపై వారికి ఎటువంటి అధికారిక హక్కులు లేవు. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గురువారం గోవిందు ఇంటికి వెళ్లి బట్టలు పెట్టి మరీ శాశ్వత ఇంటి పట్టాను అందజేశారు. దీంతో గోవిందు కుటుంబం ఆనందంతో పొంగిపోయింది. మరో 30ఏళ్లు మంగళగిరికి మీరే ఎమ్మెల్యేగా ఉండాలయ్యా అని గోవిందు కుటుంబ సభ్యులు లోకేష్ కు దీవెనలు అందించింది. ఉదయం 10.30 గంటల ప్రాంతంలో మంత్రి లోకేష్ గోవిందు ఇంటికి చేరుకున్నారు. గోవిందు కుటుంబం లోకేష్ ను సాదరంగా తమ ఇంటిలోకి ఆహ్వానించింది. వారి కుటుంబ యోగక్షేమాలను తెలుసుకున్నారు. తాము దుగ్గిరాల నుంచి ఇక్కడకు వచ్చి 2008లో ఇల్లు నిర్మించుకున్నామని గోవిందు, ఆయన భార్య సీతామహాలక్ష్మి తెలిపారు. ఇల్లు నిర్మించుకున్న తర్వాత పట్టా కోసం గత పదిహేనేళ్లుగా తమ సంఘ పెద్దలతోపాటు తాము ఎన్నోసార్లు ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. మీరు మాకు చేసిన సాయం జీవితంలో మరువలేమన్నారు.


దీనికి మంత్రి లోకేష్ స్పందిస్తూ... నాపై ఎంతో నమ్మకంతో 91వేల మెజారిటీతో నన్ను మీరు గెలిపించారు, ఇంత భారీ మెజారిటీ ఇస్తారని నేను కూడా ఊహించలేదు. మీ కల నెరవేర్చడం మంగళగిరి ఎమ్మెల్యేగా నా బాధ్యత. ఇప్పుడు మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నవాళ్లంతా నావాళ్లే. కూలీనాలి చేసి మీరు అప్పులు చేసి ఇళ్లు కట్టుకున్నారు. మీ పట్టాల కోసం నేను కేబినెట్ వరకు పోరాడి సాధించాను. దేవుడు కూడా సహకరించాడు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఇదే తరహాలో నివసిస్తున్న పేదలకు మంగళగిరిలో మేం చేసిన మోడల్ ఉపయోగపడుతుంది. మేనెల నుంచి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టిసారిస్తున్నా. పార్కులు, రోడ్లు, చెరువులు, ఇతర మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని చెప్పారు. గోవిందు కుటుంబంతో మాట్లాడిన లోకేష్.. ఉదయం 10.59 గంటల ముహూర్తానికి బట్టలుపెట్టి పట్టాను గోవిందు కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గోవిందు కుటుంబసభ్యులు ఆప్యాయతతో ఇచ్చిన పాయసాన్ని లోకేష్ స్వీకరించి, వారితో ఫోటోలు దిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి: