
ఘనవిజయంతో నా బాధ్యత పెరిగింది..
2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి తొలిసారి పోటీచేసి 5,300 ఓట్లతేడాతో ఓడిపోయాను. మొదటి రోజు బాధపడ్డా, రెండో రోజునుంచి మంగళగిరి ప్రజల మనసు గెలిచేందుకు ప్రయత్నించా. గత అయిదేళ్లుగా సొంత నిధులతో నియోజకవర్గంలో 26 సంక్షేమ కార్యక్రమాలు అమలుచేశా. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఉచిత తాగునీటి ట్యాంకర్లు, సొంత డబ్బుతో ఉచితంగా గ్రావెల్ రోడ్ల నిర్మాణం, కరోనా సమయంలో ఆక్సిజన్, టెలీ మెడిసిన్ సేవలు, వైద్యసేవల కోసం ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్య రథాలు, యువత కోసం మంగళగిరి ప్రీమియర్ లీగ్, ప్రతి గ్రామానికి స్పోర్ట్స్ కిట్స్ ఇచ్చాం. మంగళగిరి ప్లేగ్రౌండ్స్ ఏర్పాటుచేశాం. ఎన్నికల ప్రచారంలో 50వేల మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరా. నన్ను గెలిపిస్తే చంద్రబాబు, పవనన్నతో పోరాడి నిధులు తెస్తానని చెప్పా. మంగళగిరి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రాష్ట్రంలో 3వ అతి పెద్ద మెజారిటీ 91వేలతో నన్ను గెలిపించారు. ఈ ఘనవిజయంతో నాలో కసి, బాధ్యత పెరిగింది.
మంగళగిరిలో 50 అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం...
రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకంగా స్వచ్చ మంగళగిరి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పార్కులు, ప్లేగ్రౌండ్లు, రైతు బజార్లు అభివృద్ధి చేస్తున్నాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజి, పైప్ లైన్ ద్వారా గ్యాస్ వంటి ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా శ్మశాన వాటికలు అభివృద్ధి చేస్తున్నాం. మంగళగిరిలో మోడరన్ రైతుబజార్ నిర్మాణం, లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆధునీకరణ, మంగళగిరి ప్రజల కల అయిన వంద పడకల హాస్పటల్ ను దేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. త్వరలో వందపడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తాం. స్థానిక సంస్థల నిధులు, సిఎస్ ఆర్ ఫండ్స్ తో గత పదినెలల్లో మంగళగిరి నియోజకవర్గంలో 50 అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం.
మంగళగిరిని టిడిపి కంచుకోటగా మారుస్తా....
చేనేతలకు అధునాతన సాంకేతికతపై శిక్షణ, డిజైనింగ్ కోసం కేంద్రప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ ను ఏర్పాటుచేయబోతున్నాం. స్వర్ణకారుల కోసం 75ఎకరాల్లో జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్కు ఏర్పాటుచేసేందుకు ప్రణాళిక సిద్ధమవుతోంది. దీనివల్ల స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకోసం చిత్తశుద్ధితో బాధ్యతగా పనిచేస్తున్నాం. ఎపిలోనే మంగళగిరిని నెం.1గా నిలపాలన్నది మా లక్ష్యం. కుప్పం, హిందూపురం మాదిరి మంగళగిరిని తెలుగుదేశం పార్టీ కంచుకోటగా మారుస్తా. ఇందుకోసం గత పదినెలలుగా అహర్నిశలు కష్టపడుతున్నా. ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేద ప్రజల రెండున్నర దశాబ్ధాల కోరికను ఈరోజు నెరవేర్చా. మంగళగిరిని చూశాక రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులపై వత్తిడి పెరుగుతుంది.
3 విడతల్లో అందరికీ శాశ్వత పట్టాలు
ఈరోజు ఉండవల్లిలో రాజమండ్రి గోవిందు కుటుంబానికి ఇచ్చిన పట్టా రిజిస్ట్రేషన్ విలువ రూ.9లక్షలు. మార్కెట్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది. గతంలో మాదిరి బుల్డోజర్లతో ఇళ్లు కూల్చడం లేదు. పేదల దశాబ్ధాల కల నెరవేరుస్తున్నాం. అటవీ భూముల్లో నివసించే వారికి ఆయాశాఖలతో మాట్లాడి జాగ్రత్తగా సమస్య పరిష్కరించాల్సి ఉంది. ఇందుకు కొంత సమయం పడుతుంది. మంగళగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నివసించే ప్రజలకు మూడువిడతలుగా శాశ్వత పట్టాలు ఇవ్వాలని నిర్ణయించాం. ప్రస్తుతం 150 గజాల్లోపు ఉంటున్న 3వేలమందికి పట్టాలు ఇస్తున్నాం. 2వవిడతలో ఎండోమెంట్స్, రైల్వే భూముల్లో నివసించేవారికి ఇస్తాం, 3వవిడత మిగిలిన వారందరికీ పట్టాల అందజేతకు చర్యలు తీసుకుంటాం. కాల్వగట్లపై నివసించే వారికి ప్రత్యామ్నాయం కోసం ఆమోదయోగ్యమైన పరిష్కరాన్ని ఆన్వేషిస్తున్నాం. మంగళగిరి-తాడేపల్లి కార్పొరేషన్, సిఆర్ డిఎ పరిధిల్లో ఉన్న గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం వేర్వేరు మోడల్స్ సిద్ధం చేస్తున్నాం. మంగళగిరిలో నాపై ప్రత్యర్థుల విమర్శలను పట్టించుకోవాల్సిన పనిలేదు. 2024 ఎన్నికల్లో నాకు వచ్చిన మెజారిటీ కంటే వారికి వచ్చిన ఓట్లు తక్కువ. కష్టపడి పనిచేసి మంగళగిరి ప్రజల మనసు గెలిచానని మంత్రి లోకేష్ చెప్పారు.