
ఆరోగ్యం కోసం ఆస్తులు అమ్ముకునే దుస్థితిలో ప్రజలు ఉంటే, అప్పులు చేసి మరీ వైద్యం చేయించుకుంటుంటే, ఇలాంటి సమయంలో మందుల ధరలు పెంచడం ఎంతవరకు సమంజసం? పన్నులు పెంచితే ధరలు పెరుగుతాయని కేంద్రం చెబుతోంది. కానీ సామాన్యుడి నడ్డి విరిచేలా మందుల ధరలు పెంచితే ఊరుకునేది లేదని మమత హెచ్చరించారు. ధరల పెంపును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తానని ప్రకటించారు. మమత ఉద్యమించడం కరెక్ట్ అని సామాన్య ప్రజానీకం నుంచి కూడా మద్దతు లభిస్తోంది.
వాస్తవానికి యాంటీబయోటిక్స్, నొప్పి నివారణ మందులు, గుండె జబ్బులు, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు ఆకాశాన్ని తాకేలా పెరుగుతున్నాయి. 2023తో పోలిస్తే 2024లో హోల్‌సేల్ ధరల సూచీ (WPI) ఆధారంగా మందుల ధరలు 1.74% వరకు పెరిగాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అంటే నిత్యావసర వస్తువుల ధరలతో పాటు, ఇప్పుడు మందుల ధరలు కూడా మంట పుట్టిస్తున్నాయి.
కొన్ని ఉదాహరణలు చూస్తే.. ప్రాణాంతక బ్యాక్టీరియాను సైతం జయించే అజిత్రోమైసిన్ 250 mg టాబ్లెట్ ధర 11 రూపాయల 87 పైసలకు చేరింది. అదే 500 mg టాబ్లెట్ ధర 23 రూపాయల 97 పైసలు. పిల్లలకు జ్వరం, నొప్పి తగ్గించే అమోక్సిసిలిన్ క్లావులానిక్ యాసిడ్ డ్రై సిరప్ ఒక్కో ml ధర 29 పైసలుగా నిర్ణయించారు. నొప్పిని క్షణాల్లో మాయం చేసే డైక్లోఫెనాక్ టాబ్లెట్ ధర 29 పైసలు, ఇబ్రూఫెన్ 200 mg టాబ్లెట్ ధర 72 పైసలు, 400 mg టాబ్లెట్ ధర 2 రూపాయల 22 పైసలకు పెరిగింది. ఇవి కేవలం శాంపిల్ మాత్రమే. గుండె జబ్బులు, డయాబెటిస్ వంటి ఇతర వ్యాధులకు సంబంధించిన మందుల ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.
మొత్తంగా 900 రకాల మందుల ధరలను పెంచుతూ నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (NPPA) తన వెబ్‌సైట్‌లో అధికారికంగా ప్రకటించింది. ఇది సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టే నిర్ణయం. ప్రభుత్వం వెంటనే మేల్కొని ఈ ధరల పెంపును నియంత్రించకపోతే, ప్రజాగ్రహం చవిచూడక తప్పదు. మమతా బెనర్జీ లాంటి నాయకులు ప్రజల పక్షాన నిలబడి పోరాడుతుంటే, ప్రజలు వారికి అండగా నిలవడం తప్పుకాదు.