
ఆంధ్రప్రదేశ్లో గత ఎన్నికల్లో అధికారం కోల్పోయాక విపక్ష వైసిపికి ఏది కలిసి రావటం లేదు. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కీలక నేతలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు వైసిపిని వీడి కూటమి పార్టీలలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పుడు అదే బాటలో పార్టీలో మరో కీలక నేత చేరుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. వైయస్ జగన్‌కు.. వైయస్ కుటుంబానికి ఆత్మీయంగా మెలిగే ఓ కుటుంబానికి చెందిన యువనేత ఇప్పుడు పార్టీని విడబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ నేత ఎవరో కాదు ? రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్. జక్కంపూడి కుటుంబానికి వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైయస్ క్యాబినెట్లో జక్కంపూడి రామ్మోహన్ రావు మంత్రిగా పనిచేశారు. తాజాగా జక్కంపూడి రాజా సోదరుడు జక్కంపూడి గణేష్ పార్టీపై పార్టీ అధినేత జగన్ పై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇప్పటికే తమ నియోజకవర్గంలో ఓ నేత పెత్తనం ఎక్కువైపోయిందని అసంతృప్తిని ఆయన పార్టీ అధిష్టానానికి కూడా చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి తగిన స్పందన రాకపోవడంతో జక్కంపూడి గణేష్ వైసిపి ని వీడేందుకు సిద్ధమవుతున్నారు. నియోజకవర్గంలో ఓ నాయకుడు వల్ల వైసిపి తీవ్రంగా నష్టపోతుందని గణేష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను ఎందుకు పార్టీ వీడుతున్నానో అధిష్టానానికి చెప్పానని రెండు రోజుల్లో ప్రెస్ మీట్ పెట్టి అన్ని విషయాలు బయటపెడతానని జక్కంపూడి గణేష్ వెల్లడించారు. దీంతో జక్కంపూడి గణేష్ ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారన్నది స్థానికంగా తీవ్ర ఉత్కంఠ రేగుతోంది. అసలే జక్కంపూడి రాజా ఓసారి గెలిచి మరోసారి ఓడిపోయారు. పైగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జక్కంపూడి రాజాకు తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్ష పగ్గాలు కూడా అప్పగించారు.
ఇక కీలకమైన కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా రాజాకు కట్టబెట్టారు. మరి జగన్ ఎంత ప్రయారిటీ ఇచ్చిన జక్కంపూడి గణేష్ ఎందుకు పార్టీ వీడాలని అనుకుంటున్నారు నియోజకవర్గంలో గణేష్ ని ఇబ్బంది పెడుతున్న ఆ నేత ఎవరు అన్నది సస్పెన్స్ గా మారింది. అయితే రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాన్ని భరత్ కు జక్కంపూడి కుటుంబానికి అసలు సఖ్యత లేదు. ఈ విషయంలో జగన్ భరత్ కు ఎక్కువ ప్రయార్టీ ఇస్తున్నారు అన్న అసంతృప్తి జక్కంపూడి ఫ్యామిలీ లో ఉంది.