
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య వైఎస్సార్ కుటుంబం లో చీలికలు తెచ్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ హత్య 2019 ఎన్నికలకు కాస్త ముందుగా జరిగింది. అయితే 2024 ఎన్నికలకు వచ్చే సరికి ఈ హత్య పై వైఎస్ షర్మిలా రెడ్డి, వైఎస్ సునీతా రెడ్డి ఎన్నో ఆరోపణలు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డితో పాటు వైఎస్ జగన్ టార్గెట్ గానే సునీతా రెడ్డి, అటు షర్మిలా రెడ్డి ఇద్దరూ నానా రచ్చ చేశారు. ఎన్నో సంచలన ఆరోపణలు చేశారు. 2024 ఎన్నికలలో జగన్ ఓడిపోవడానికి ఉన్న కారణాలలో ఇది కూడా ఒకటి. ఇదిలా ఉంటే తాజాగా జగన్ సోదరి షర్మిల ఈ విషయంలో చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి బెయిల్ పై బయటే ఉంటే… వివేకా కూతురు సునీత ప్రాణాలకు రక్షణ ఎలా ఉంటుందని షర్మిల ప్రశ్నించారు. అవినాష్ స్వేచ్ఛ గా బయట తిరుగుతున్నాడని .. కేసులో కీలక సాక్షులు ఒక్కొక్కరుగా చని పోతున్నారని కూడా ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో సునీత ప్రాణాలకు ముప్పు ఉందని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. వివేకా హత్య జరిగినప్పుడు సునీత .. ఆమె భర్త అక్కడ లేరని చెప్పిన షర్మిల .. ఆ టైంలో అక్కడ అవినాష్ రెడ్డి మాత్రమే ఉన్నాడని తెలిపారు. వివేక గుండె పోటుతో చనిపోయారని చెప్పింది కూడా అవినాషే నని ఆమె ఆరోపించారు.
కేసును తారుమారు చేసేందుకు అవినాశ్ ఆది నుంచి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేందుకు ఇదే నిదర్శనం అని ఆమె తెలిపారు. అవినాష్ కేసు తారుమారు చేసేందుకు ఇప్పటకీ ప్రయత్నాలు చేస్తున్నారని ... అలాంటప్పుడు ఆయన బయట ఉంటే ఈ కేసులో నిజాలు ఎలా బయటకు వస్తాయని ప్రశ్నించారు. ఇక కేసులో కీలక సాక్షులు, నిందితులు వరుసగా చనిపోతున్న విషయాన్ని కూడా గమనించాలని ఆమె గుర్తు చేశారు. కేసు దర్యాప్తు జరుగుతున్న తీరు చూస్తుంటే సునీత ప్రాణాలకు రక్షణ లేదని కూడా ఆమె వాపోయారు. ఓ సీబీఐ అధికారిని కూడా అవినాష్ ఇంటికి పిలిపించుకుని బెదిరించారని కూడా ఆమె ఆరోపించారు.