
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు బీసీవై జాతీయ అధ్యక్షులు బోడే రామ చంద్ర యాదవ్ లేఖాస్త్రం సంధించారు. మొత్తం ఐదు డిమాండ్లను ఆయన చంద్రబాబు ముందు ఉంచారు. పేద ప్రజల ఆశాజ్యోతి, బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం అయిన మహాత్మ జ్యోతిరావ్ పూలే ఎన్నో కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఎందరినో జాగృతం చేసిన మహానీయుడు. పూలే జయంతి రోజు అయిన ఏప్రిల్ 11న ప్రభుత్వం పబ్లిక్ హాలీడేగా ప్రకటించడంతో పాటు ఏప్రిల్ 11 పూలే జయంతిని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరుతున్నాను. ఇప్పటికే మహారాష్ట్ర అసెంబ్లీ పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది . . కేంద్ర ప్రభుత్వంలో మీ కూటమి ప్రభుత్వం ప్రధాన భాగస్వామిగా ఉంది. మీరు కూడా ఏపీ అసెంబ్లీలో పూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడంతో పాటు ఈ దంపతులకు భారతరత్న ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ విషయం లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుంటుందన్న ఆకాంక్ష ను కూడా బోడే వ్యక్తం చేశారు.
ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు.. అన్ని పార్టీలకు చెందిన బీసీ సంఘాల ప్రతినిథులతో ముఖ్యమంత్రిగా మీ అధ్యక్షతన సమగ్ర కులగణన, రిజర్వేషన్ల పెంపు అంశంపై చర్చ జరపాలి. మీ తెలుగుదేశం పార్టీ బీసీల పునాదులపై ఏర్పడింది. బీసీల మద్దతుతో 22 ఏళ్ల పాటు అధికారం అనుభవించిన మీరు ఇప్పటి వరకు బీసీలకు నిజంగా చేసిందేమి లేదనే చెప్పాలి. బీసీలకు, బీసీ కుల వృత్తుల వారికి.. బీసీల అభివృద్ధికి ఇప్పటికి అయినా మీరు నడుం బిగించాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నాను అని రామ చంద్ర యాదవ్ తన లేఖలో పేర్కొన్నారు.