
ఉమ్మడి కడప జిల్లాలో కూటమి 2024 ఎన్నికల్లో పుంజుకున్న సంగతి తెలిసిందే. ఎన్నో దశాబ్దాల తర్వాత టీడీపీ నేతలకు అక్కడ అధికారం దక్కింది. అయితే వచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకునే విషయంలో ఉమ్మడి కడప జిల్లా నేతలు ఫెయిల్ అవుతున్నారా అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తుండటం గమనార్హం. ఉమ్మడి కడప జిల్లాలో వర్గ పోరు పతాక స్థాయికి చేరిందని భోగట్టా.
ఒకప్పుడు ఉమ్మడి కడప జిల్లా అంటే జగన్ కు కంచుకోట కాగా జగన్ పాలన విషయంలో చేసిన తప్పుల వల్ల ఈ పరిస్థితి మారింది. మహానాడు ఏర్పాటు ఉమ్మడి కడప జిల్లాలో స్థలం ఎంపికకు సంబంధించి విబేధాలు బయటపడటం గమనార్హం. పులివెందులలో టీడీపీ నేతలు రెండు వర్గాలుగా వీడిపోయి గొడవ పడటం కూడా ఒకింత సంచలనం అయిన సంగతి తెలిసిందే.
జమ్మలమడుగులో టీడీపీ ఇంఛార్జ్ భూపేష్, బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి మధ్య గ్యాప్ ఉంది. కడప అసెంబ్లీలో టీడీపీ నేతల మధ్య విబేధాల గురించి కథలు కథలుగా చెప్పుకుంటారు. కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి సైతం ఎన్నికల్లో విజయం తర్వాత పలు వివాదాల ద్వారా వార్తల్లో నిలిచారు. మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ కొన్ని వర్గాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారనే వార్తలు ప్రచారంలోకి రావడం కొసమెరుపు.
కమలాపురం నియోజకవర్గంలోని టీడీపీ నేతల్లో ఊహించని స్థాయిలో అసంతృప్తి ఉంది. బద్వేల్ టీడీపీ ఇంఛార్జ్ రితేష్ రెడ్డికి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత దక్కడం లేదు. రాబోయే రోజుల్లో అయిన ఈ పరిస్థితి మారుతుందేమో చూడాల్సి ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 2029 ఎన్నికల సమయానికి టీడీపీ నేతల మధ్య ఇదే గ్యాప్ కొనసాగితే మాత్రం పార్టీ పుంజుకునే ఛాన్స్ అయితే ఉండదని కచ్చితంగా చెప్పవచ్చు. చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు మారే అవకాశాలు ఉంటాయి.