అమెరికా అంటే బతుకుతెరువుకు స్వర్గధామం అనే రోజులు గత చరిత్ర. డాలర్ల కళ్లల్లో కలలు కంటూ.. వీసా ఏదైతేనేం అమెరికా గడ్డపై కాలు మోపితే చాలు అనుకునే రోజులకు కాలం చెల్లిపోయింది. ట్రంప్ సర్కార్ మళ్లీ తన ప్రతాపం చూపిస్తోంది. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా హెచ్‌1బీ, ఎఫ్‌1 వీసాలతో వెళ్ళిన మనోళ్లకు ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి.

అమెరికా వెళ్లిన తల్లిదండ్రుల గుండెల్లో ఇప్పుడు దడ పుడుతోంది. ఉద్యోగాలు ఊడిపోతే తిరిగి స్వదేశానికి రావాలంటే కష్టాలు, అక్కడ ఉండలేకపోతే భవిష్యత్తు అగమ్యగోచరం. ఇలాంటి పరిస్థితుల్లో ట్రంప్ కొత్త ప్లాన్ తో ముందుకొచ్చారు. గతంలో మెయిల్స్ అందుకున్న అక్రమ వలసదారులతో పాటు, చట్టబద్ధంగా లేనివారిని దేశం విడిచి వెళ్ళమని ఆర్డర్స్ జారీ చేశారు.

గుర్తిస్తే రోజుకు 990 డాలర్లు అంటే మన కరెన్సీలో అక్షరాలా 85 నుండి 90 వేల రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. డబ్బులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తారట. ఇది ట్రంప్ వేసిన సరికొత్త ఎత్తుగడ. రాబోయే మూణ్నాలుగు సంవత్సరాల్లో ఇది పెను సమస్యగా మారనుంది. ట్రంప్ మొహమాటాలకు పోయే మనిషి కాదు అన్నది అందరికీ తెలిసిందే. గతంలో పాలకుడిగా ఉన్నప్పుడు కూడా ఇదే పంథాను అనుసరించారు.

అమెరికా లెక్కల ప్రకారం కోటి మంది అక్రమంగా నివసిస్తున్నారు. బంధువులున్నారని, ఏదో ఒక పని చేసుకుంటూ బతకవచ్చని చాలామంది అక్కడే తిష్ట వేశారు. ఎఫ్1 వీసా మీద వెళ్ళి అక్కడ ఏదో ఒక పనిచేసుకుంటూ కాలం వెళ్లదీస్తున్నారు. హెచ్‌1బీ వీసా మీద వెళ్ళిన వాళ్లకు ఉద్యోగం పోతే అంతే సంగతి. కానీ మనోళ్ళు తెలివైనోళ్ళు.. కొన్ని కంపెనీలతో కుమ్మక్కై హెచ్‌1బీ వీసా కింద జీతం తీసుకుంటూ ఏదోలా నెట్టుకొస్తున్నారు. ఇదంతా ఒక కొత్త మాయాజాలంలా సాగుతోంది.

ఇలా బంధువుల అండతో, అక్రమ మార్గాల్లో కోటి మంది అమెరికాలో తిష్ట వేశారని తేల్చారు. వీరందరికీ ట్రంప్ సర్కార్ గట్టి వార్నింగ్ ఇచ్చింది. "మీరు అక్రమంగా ఉంటున్నారు.. వెళ్లిపోతారా లేదా.. పట్టుబడితే మాత్రం రోజుకు 90 వేల రూపాయలు ఫైన్.. ఆస్తులు జప్తు" అని తేల్చి చెప్పింది. ఇది ప్రస్తుతానికి ట్రైలర్ మాత్రమే. భవిష్యత్తులో షెల్టర్ ఇచ్చిన బంధువులను కూడా టార్గెట్ చేస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. అమెరికా కల కుప్పకూలిపోవడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: