హైదరాబాదులో  అక్రమ నిర్మాణాల ముసుగులో అధికారులు సామాన్యుల నుంచి లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటూ ఇబ్బందులకు గురి చేస్తున్న ఘటనలు రోజుకోటి తారస పడుతూనే ఉన్నాయి. తాజాగా కూకట్పల్లిలో స్థానిక ఎమ్మెల్యే అధికారులపై సీరియస్ అయిన తీరు  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు  ఒక వ్యక్తి ఇంటి నిర్మాణం విషయంలో అధికారులతో మాట్లాడుతూ డబ్బులు ఇస్తే అక్రమ నిర్మాణాలకు కూడా పర్మిషన్ ఇస్తారా అంటూ ప్రశ్నించాడు. అంతేకాకుండా జిహెచ్ఎంసి కమిషనర్, అడిషనల్ సిసిపికి ఫిర్యాదు చేశాడు. అక్రమ నిర్మాణాలపై  ఉక్కు పాదం మోపుతామని చెబుతున్నటువంటి చాలామంది టౌన్ ప్లానింగ్ అధికారులు, డబ్బులు తీసుకుంటూ అక్రమ నిర్మాణాలు చేపట్టడానికి సహకరిస్తున్నారని తెలియజేశారు. 

డబ్బులు ఇచ్చుకోలేని పేదల ఇండ్లపై పడి అక్రమ నిర్మాణాలు అంటూ బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలియజేశారు. ముఖ్యంగా హైదరాబాదులో ఉండేటువంటి తెలుగు ప్రజలకు ఈ పరిస్థితి చాలా వరకు తారసపడుతోంది. ఇక అధికారుల అలసత్వాన్ని అండగా చూసుకున్నటువంటి కొంతమంది లోకల్ రిపోర్టర్స్ కూడా  బాధితుల వద్దకు వెళ్లి గ్రూపులు గ్రూపులుగా డబ్బులు వసూలు చేస్తున్నారని  అంటున్నారు. ముఖ్యంగా సిటీలో ఒక్కో బిల్డింగ్ పర్మిషన్ కోసం 35లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది కూకట్పల్లి ఒక ప్రాంతంలో  ఈ లెక్క ఉంటే మిగతా ప్రాంతాల్లో ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వీటన్నింటిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు జిహెచ్ఎంసి కమిషనర్ కు ఫిర్యాదు చేశాడు.

 అంతే కాదు నా నియోజకవర్గంలో ఒక న్యాయం మరో నియోజకవర్గంలో ఇంకో న్యాయమా అంటూ అధికారులను కడిగిపారేశారు. డబ్బులు ఇస్తే అక్రమ నిర్మాణాలను కూడా సక్రమ నిర్మాణాలుగా చూపిస్తారా అంటూ ప్రశ్నించారు. అధికారులు బెదిరించేది పైసా పైసా కూడేసుకొని కట్టుకున్న పేదల నిర్మాణాలపైనే అన్నారు. ఇలాంటి ఘటనలు రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా కూకట్పల్లిలో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ వారు ఉంటారు. అయితే వీరందరినీ టార్గెట్ చేస్తూ కొంత మంది అధికారులు  డబ్బులు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపాలిటీ దగ్గర అన్ని పర్మిషన్లు తీసుకున్నా కానీ ఇల్లు నిర్మాణం చేయాలంటే తప్పనిసరిగా లంచం ఇచ్చుకోవాల్సిందే అని  టౌన్ ప్లానింగ్ అధికారులు బెదిరిస్తున్నారని ఎమ్మెల్యే ప్రస్తావించారు. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: