హైదరాబాద్ కేంద్రంగా భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌ను శాసించాలని కలలుగన్న చైనా దిగ్గజం బీవైడీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. బిలియన్ డాలర్ల పెట్టుబడితో దేశంలోకి అడుగుపెట్టాలనుకున్న ఆ సంస్థ ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాలతో చెక్ పెట్టింది. ఈ పరిణామం తెలంగాణ ప్రభుత్వ వర్గాల్లో, దేశంలోని చైనా అనుకూల లాబీల్లో తీవ్ర నిరాశను మిగిల్చింది. ఇది కేవలం ఓ కంపెనీకి అనుమతి నిరాకరణ కాదు, మారుతున్న ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ అనుసరిస్తున్న కఠిన వైఖరికి నిదర్శనం.

ప్రపంచ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్‌లో అమెరికాకు చెందిన టెస్లా, చైనాకు చెందిన బీవైడీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. చైనాలో బీవైడీదే సింహభాగం మార్కెట్ వాటా కాగా, అమెరికాలో టెస్లా ఆధిపత్యం కొనసాగుతోంది. ఇప్పుడు భారత్ వంటి భారీ మార్కెట్‌పై రెండు కంపెనీలూ కన్నేశాయి. బీవైడీ ప్రవేశాన్ని అడ్డుకోవడం ద్వారా, పరోక్షంగా టెస్లాకు మార్గం సుగమం చేసేలా అమెరికా పావులు కదిపిందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.

మస్క్ ఒత్తిడి ఫలించిందా లేక ఇది కేవలం యాదృచ్ఛికమా అనేది పక్కన పెడితే, చైనా దూకుడుకు కళ్లెం వేయాలన్న అమెరికా వ్యూహంలో ఇది భాగమేనని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీవైడీ ప్రతిపాదనను తిరస్కరించడానికి భారత ప్రభుత్వం భద్రతా కారణాలనే ప్రధానంగా ప్రస్తావించింది. ఇది కేవలం సాకు మాత్రమేనా లేక నిజంగానే ముప్పు ఉందా అనే కోణంలో చూస్తే, చైనాతో ఉన్న సరిహద్దు ఉద్రిక్తతలు, సైబర్ దాడుల చరిత్రను విస్మరించలేం.

ఇటీవల కాలంలో కొన్ని దేశాల్లో శత్రుదేశాలకు చెందిన ఎలక్ట్రానిక్ పరికరాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు ఎలా రిమోట్‌గా నిర్వీర్యం చేయబడ్డాయో, కొన్ని సందర్భాల్లో పేలిపోయాయో చూశాం. రేపు చైనాతో పరిస్థితులు విషమిస్తే, రోడ్లపై తిరిగే లక్షలాది బీవైడీ కార్లను ఆయుధాలుగా మార్చరని గ్యారెంటీ ఏంటి? వాటిని రిమోట్‌గా నియంత్రించి, లాక్ చేసి, లేదా అంతకంటే ప్రమాదకరంగా జనావాసాల్లో పేల్చివేసే సాంకేతికత చైనా వద్ద ఉండదా?

ఈ అనుమానాలే భారత ప్రభుత్వ నిర్ణయానికి కారణభూతమై ఉండవచ్చు. "ట్రోజన్ హార్స్" లాగా దేశంలోకి ప్రవేశించి, కీలక సమయంలో ప్రమాదంగా మారే అవకాశం ఉన్న టెక్నాలజీ పట్ల అప్రమత్తంగా ఉండటమే మేలని ప్రభుత్వం భావించినట్లు స్పష్టమవుతోంది.

భారతదేశానికి పొరుగున ఉన్న దేశాల్లో అత్యంత నమ్మశక్యం కాని దేశం ఏదైనా ఉందంటే అది చైనాయే. భూటాన్, నేపాల్ వంటి దేశాలు కూడా క్రమంగా చైనా ప్రభావంలోకి జారుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. డ్రాగన్ దేశం తన ఆర్థిక, సైనిక శక్తితో పొరుగు దేశాలను లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ఇలాంటి నేపథ్యంలో, వ్యూహాత్మకంగా కీలకమైన ఆటోమొబైల్, ముఖ్యంగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీ అయిన ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో చైనా కంపెనీకి భారీ స్థాయిలో ప్రవేశం కల్పించడం ఆత్మహత్యా సదృశ్యమే అవుతుందని రక్షణ, విదేశాంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బీవైడీ పెట్టుబడి తిరస్కరణ వెనుక అమెరికా ఒత్తిడి ఉందో లేదో పక్కన పెడితే, భారత్ తన జాతీయ భద్రత, దీర్ఘకాలిక వ్యూహాత్మక ప్రయోజనాలకే పెద్దపీట వేసిందన్నది స్పష్టం.

మరింత సమాచారం తెలుసుకోండి: