మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చిన ప్రత్యేక హామీలను యుద్ధప్రాతిపదికన అమలుచేస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మన ఇల్లు-మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు ఉదయం మంగళగిరి డాన్ బాస్కో స్కూల్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన సభలో రత్నాలచెరువుకు చెందిన 600 మంది పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందజేశారు. ముందుగా మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. అనంతరం మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. కొన్ని నిర్ణయాలు మన జీవితాలనే మార్చేస్తాయి. మంగళగిరిలో పోటీ చేయాలని 2019లో నేనొక నిర్ణయం తీసుకున్నా. మీ సమస్యలేంటో నాకు తెలియదు. నేనేంటో మీకు తెలియదు. ఎన్నికలకు 21 రోజుల ముందు టీడీపీ అభ్యర్థిగా పోటీచేశా. 5,300 ఓట్లతో ఓడిపోయా. మొదటి రోజు బాధ కలిగింది, ఆవేదన కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. ప్రజలకు మంచి పనులు చేసి వారి మనస్సు గెలుచుకోవాలని ఆనాడే నేను నిర్ణయించుకున్నా.


ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మంగళగిరి ప్రజల కోసం 26 సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం
ఒక్కసారి ఆలోచించండి. 2019 నుంచి 2024వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మీ ఆరోగ్యం కోసం ఎన్టీఆర్ సంజీవని తీసుకురావడం జరిగింది. తాడేపల్లిలో, మంగళగిరిలో, దుగ్గిరాలలో క్లినిక్ ఏర్పాటుచేసి నేటికీ కొనసాగిస్తున్నాం. ఈ రోజుకీ సొంత నిధులతో ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. కుటుంబంలో పెళ్లి జరిగితే పెళ్లి కానుక ఇస్తున్నాం. మహిళలు సొంత కాళ్లపై నిలబడేలా ఉచితంగా కుట్టు మిషన్ ఇవ్వడంతో పాటు శిక్షణ కూడా అందించాం. వారికి ఉపాధి కూడా కల్పిస్తున్నాం. గత ప్రభుత్వం నీరు సక్రమంగా అందించలేకపోతే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు అందించాం. యువత క్రికెట్ ఆడేందుకు మంగళగిరి ప్రీమియర్ లీగ్ ఏర్పాటుచేశాం. కోవిడ్ సమయంలో ఆక్సిజన్ సిలిండర్లతో పాటు మందులు అందించాం. అమెరికా డాక్టర్ల ద్వార టెలీమెడిసిన్ అందజేశాం. ఈ విధంగా దాదాపు 26 సంక్షేమ కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం చేపట్టడం జరిగింది.


ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని చెప్పా
2024 ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీ చేయాలని చాలా మంది చెప్పారు. ఐదేళ్లు కష్టపడ్డా, మంగళగిరి ప్రజల మనస్సు గెలుచుకున్నానని ఆనాడు చెప్పా. ఒకే స్థానం నుంచి పోటీ చేస్తా.. అది మంగళగిరి నుంచే పోటీచేస్తానని చెప్పా. ప్రచారంలో మీ వద్దకు వచ్చాను. ఏ మెజార్టీతో అయితే ఓడిపోయానో దాని పక్కన సున్నాపెట్టి 53వేల ఓట్లతో గెలిపించాలని కోరా. మీరు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని చెప్పా. సర్వేల్లో కుప్పం కంటే ఒక్క శాతం వెనుకబడి ఉన్నాం. మీరు చూపించిన అభిమానం, ప్రేమ చూసి ఒక్క ఓటు అన్నా ఎక్కువ వస్తుందని బాబు గారితో ఛాలెంజ్ చేశా. మంగళగిరి ప్రజలు ఎవరూ ఊహించని విధంగా 91వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి శాసనసభకు పంపించారు.


ఈ నెల 13న మంగళగిరి వంద పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన
మీరు ఇచ్చిన మెజార్టీ కొండంత బలం. దశాబ్దాల కల వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి. ఏపీలో మొదటి వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంగళగిరి నియోజకవర్గానికి శాంక్షన్ అయింది. ఈ నెల 13న శంకుస్థాపన చేస్తున్నాం. ఏడాదిలోగా పూర్తిచేస్తాం. చిల్లపల్లి గారు బాధ్యత తీసుకుంటారు. పార్క్ లు, చెరువులను అభివృద్ధి చేస్తున్నాం. భూగర్భ డ్రైనేజీ, భూగర్భ వాటర్ పైప్ లైన్, భూగర్భ గ్యాస్, కరెంట్ ప్రాజెక్టులు చేపడుతున్నాం. జూన్, జులైలో ఆ కార్యక్రమాలు కూడా చేపడతాం. కొండ దిగువన లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం తర్వాత పానకాల స్వామి గుడికి వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నామని చాలామంది చెప్పారు. దీంతో ఉచితంగా బస్సు ఏర్పాటుచేశాం. మంగళగిరి, తాడేపల్లి నుంచి ఎయిమ్స్ కు వెళ్లేందుకు రెండో బస్సు కూడా ఉచితంగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటుచేయడం జరిగింది. ఇచ్చిన ప్రతి హామీ పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ పోతున్నాం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: