గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన మంత్రి శ్రీధర్ బాబు, కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్‌తో సహా తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. మూసి నది ప్రక్షాళనను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టినట్లు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని చూస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్ర ప్రగతిని నిరోధించే బీఆర్ఎస్ ఆలోచనలు ప్రజలకు అర్థమవుతున్నాయని విమర్శించారు.

హెచ్‌సీయూ భూముల విషయంలో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భూములు ప్రభుత్వానివని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినట్లు గుర్తు చేశారు. వైజాగ్‌లో జింక వచ్చిన దృశ్యాలను హెచ్‌సీయూలో జరిగినట్లు చూపడం, ఏనుగులు ఉన్నాయని కృత్రిమ మేధస్సుతో ప్రచారం చేయడం వంటి చీప్ ఎత్తుగడలను ఖండించారు. ఏనుగు ఉంటే అందరికీ తెలిసిపోదా అని ప్రశ్నించారు. తప్పులు ఉంటే నిర్దేశించాలి కానీ, ఇలాంటి బూటకపు ప్రచారాలు బీఆర్ఎస్ దిగజారుడును చూపిస్తున్నాయని హితవు పలికారు.

బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన ఆరోపణలను శ్రీధర్ బాబు తిప్పికొట్టారు. 5200 కోట్ల భూమిని 30,000 కోట్లుగా చూపారన్న వాదనను తోసిపుచ్చారు. సెబీ నిబంధనలకు అనుగుణంగా బాండ్ల ద్వారా నిధులు సేకరించినట్లు వివరించారు. ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రుణం తీసుకోలేదని, బాండ్ల ద్వారా వచ్చిన నిధులను మాత్రమే ఉపయోగించినట్లు స్పష్టం చేశారు. 37 సంస్థలు టీజీఐఐసీలో బాండ్లు కొనుగోలు చేసినట్లు, ఈ ప్రక్రియ పారదర్శకంగా జరిగినట్లు తెలిపారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా వంటి పథకాల కోసం 9.3 శాతం వడ్డీతో అప్పులు తీసుకున్నామని, బీఆర్ఎస్ మాత్రం కాళేశ్వరం కోసం 10.9 శాతం వడ్డీతో రుణాలు తీసుకుందని పోల్చి చూపారు.

హెచ్‌సీయూ భూములు లిటిగేషన్‌కు సంబంధించినవి కావని, సుప్రీం కోర్టు వాటిని ప్రభుత్వ భూములుగా ధృవీకరించినట్లు శ్రీధర్ బాబు పునరుద్ఘాటించారు. భూ బదిలీల విషయంలో ప్రభుత్వం కేవలం జీవోలు జారీ చేస్తుందని, పట్టా పాసు పుస్తకాలు ఇవ్వడం జరగదని వివరించారు. బీఆర్ఎస్ హయాంలోనూ ఇలాంటి బదిలీలు జరిగాయని, అప్పుడూ పాసు పుస్తకాలు ఇవ్వలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, ప్రజా పథకాల అమలు కోసం నిధులు సేకరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ పెట్టుబడులను అడ్డుకోవాలని చూస్తున్నా, తెలంగాణ అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ధీమా వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: