
ఒకప్పుడు చైనా వస్తువులు తక్కువ ధరకే లభించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. అమెరికాలో చైనా వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అదే సమయంలో ఇతర దేశాల ఉత్పత్తులు చైనా వస్తువుల కంటే తక్కువ ధరకే లభిస్తుండటంతో అమెరికన్లు వాటిపైనే మొగ్గు చూపుతున్నారు. దీంతో చైనా వస్తువులు అమెరికా గడ్డపై అమ్మలేక, తిరిగి వెనక్కి తీసుకెళ్లలేక సతమతమవుతోంది.
అమెరికా మార్కెట్ మూసుకుపోవడంతో చైనా దృష్టి ఇప్పుడు భారత్‌పై పడింది. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్లలో మన దేశం ఒకటి. 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారత్‌లో చైనా వస్తువులకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాదు, చైనా వస్తువులను మన దేశంలోకి తీసుకురావడం కూడా చాలా సులువు. సరిహద్దులు దాటించి, అక్రమ మార్గాల్లో కూడా చైనా వస్తువులు మన మార్కెట్‌లోకి ఈజీగా ఎంటర్ అయిపోతాయి.
ఇది మన దేశానికి పెను ప్రమాదం. చైనా తన వస్తువులను మన దేశంలో డంప్ చేస్తే, మన దేశీయ పరిశ్రమలు కుదేలవుతాయి. ఇప్పటికే చాలా రంగాల్లో చైనా వస్తువుల హవా కొనసాగుతోంది. ఇప్పుడు మరింతగా చైనా వస్తువులు మన మార్కెట్‌ను ముంచెత్తితే, మన వ్యాపారులు, చిన్న పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతారు.
కాబట్టి, కేంద్ర ప్రభుత్వం వెంటనే మేల్కొని, చైనా వస్తువుల డంపింగ్‌ను అడ్డుకోవడానికి కఠిన చర్యలు తీసుకోవాలి. కస్టమ్స్ నిఘాను పెంచాలి. అక్రమ రవాణాను అరికట్టాలి. దేశీయ పరిశ్రమలను కాపాడుకోవడానికి ప్రత్యేక విధానాలను రూపొందించాలి. లేదంటే, చైనా ముప్పు మన దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తుంది. అప్రమత్తంగా ఉండకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.