
తెలంగాణలో త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందన్న వార్తలు గత ఆరేడు నెలలుగా గట్టిగా వినిపిస్తున్నాయి. దీనిపై ఎవరి లెక్కల్లో వారు ఉన్నారు. కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి అయితే తనకు మంత్రి పదవి రాకుండా జానా రెడ్డి అడ్డుకుంటున్నారని కూడా ఓపెన్ గానే విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవులు కావాలని ఓపెన్ గానే రకరకాల కామెంట్లు చేసేస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రి పదవులు గురించి ఓపెన్ గా మాట్లాడుతున్న ఎమ్మెల్యలేకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మంత్రి పదవుల గురించి మాట్లాడితే మీకు నష్టం అని చెప్పిన రేవంత్ పార్టీ నేతలను హెచ్చరించారు. శంషాబాద్ నోవాటెల్ లో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఆయన పలు అంశాలపై ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ క్రమంలో మంత్రి పదవుల ప్రస్తావన రాగా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిపై రేవంత్ ఈ సందర్భంగా అసహనం వ్యక్తం చేశారు.
మంత్రి పదవుల విషయం లో పలువురు పేర్లు ఎందుకు ? ప్రస్తావనకు తీసుకు వస్తారు ? మంత్రి పదవుల విషయం లో తుది నిర్ణయం హై కమాండ్ మాత్రమే తీసుకుంటుందని .. దీనిపై ఎవ్వరూ మాట్లాడవద్దని .. అలా చేస్తే అది వారికే నష్టం అని రేవంత్ తేల్చి చెప్పారు. ఇక కొందరు ఎమ్మెల్యేలు వీకెండా పాలిటిక్స్ చేస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. చాలా మంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లడం లేదని.. నియోజకవర్గాలకు వారాంతంలోనే వెళ్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రేపటి నుంచి విస్తృతంగా నియోజకవర్గాల్లో తిరగడంతో పాటు ప్రభుత్వం చేసిన మంచి పనుల గురించి చెప్పాలన్నారు.