టీడీపీ హయాంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫైబర్‌నెట్ ప్రాజెక్టు.. గత ప్రభుత్వంలో వివాదాల వలయంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. అయితే, తాజాగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న ఒక కీలక నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఫైబర్‌నెట్‌లో గతంలో చోటుచేసుకున్న అవకతవకలపై గళం విప్పి, పదవికి రాజీనామా చేసిన మాజీ ఛైర్మన్ జీవీ రెడ్డి చెప్పిన పనులే ఇప్పుడు ప్రభుత్వం చేస్తోంది. దీంతో జీవీ రెడ్డి మాటలకు విలువ దక్కిందా? లేక ఇది రాజకీయ వ్యూహమా? అనే చర్చ మొదలైంది.

వివరాల్లోకి వెళితే.. ఫైబర్‌నెట్ సంస్థలో సూర్య ఎంటర్‌ప్రైజెస్ ద్వారా నియమితులైన దాదాపు 500 మంది ఉద్యోగులను తక్షణమే తొలగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెలాఖరుతో వారందరి కాంట్రాక్టు ముగుస్తుందని, ఇకపై పొడిగింపు ఉండదని సంస్థ యాజమాన్యం స్పష్టం చేసింది. గతంలో ఉద్యోగులు ఆఫీసుకు రాకుండానే జీతాలు తీసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా పనిచేసిన జీవీ రెడ్డి.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఫైబర్‌నెట్ ప్రాజెక్టులో భారీ అవకతవకలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. అనర్హులైన వ్యక్తులను నియమించారని, నిధులు దుర్వినియోగం చేశారని బాహాటంగా విమర్శించారు. ప్రఖ్యాత దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సినిమా ప్రసారం కోసం రూ. 2.05 కోట్లు చెల్లించారని వెల్లడించి అందరినీ షాక్‌కు గురి చేశారు. ఇలాంటి చర్యలతో సంస్థ ఆర్థికంగా చితికిపోయిందని, కొత్త కనెక్షన్లు ఇవ్వలేని దుస్థితికి చేరుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని సరిదిద్దడానికి అనేక సంస్కరణలు, సిఫార్సులు చేశారు.

వైసీపీ ప్రభుత్వంలో నియమించిన 400 మంది అనర్హ ఉద్యోగులను తొలగించాలని, ఆర్థిక, సాంకేతిక సంస్కరణలు చేపట్టాలని జీవీ రెడ్డి సూచించారు. కానీ, అప్పటి అధికారులు ఆయన మాటలను పట్టించుకోలేదు. సహకరించకపోగా, విమర్శలు గుప్పించారనే వాదనలు వినిపించాయి. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన జీవీ రెడ్డి.. ఛైర్మన్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

అయితే ఇప్పుడు జీవీ రెడ్డి సూచించిన చర్యలను ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తోంది. అనర్హత గల ఉద్యోగులను తొలగిస్తూ ఫైబర్‌నెట్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోంది. జీవీ రెడ్డి చెప్పిన మాటలు అప్పట్లోనే విని ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి జీవీ రెడ్డికి ఇప్పుడు న్యాయం జరిగిందా? లేక ఇది కేవలం రాజకీయ క్రీడలో భాగమా? వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: