హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మీడియా సమావేశం నిర్వహించి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నేషనల్ హెరాల్డ్ కేసును నిరసిస్తూ కాంగ్రెస్ ధర్నా చేసినట్లు ప్రచారం చేసినప్పటికీ, అసలు వాళ్లు అసభ్య పదజాలంతో గొడవ సృష్టించేందుకే ఆందోళన చేశారని ఆరోపించారు. ఈ కేసుకు బీజేపీకి, ప్రధాని మోదీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. స్వాతంత్ర సమరయోధులైన 5 వేల మంది ఆస్తులను గాంధీ కుటుంబం స్వాధీనం చేసుకుందని, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు తలో 38 శాతం షేర్లు, మిగిలిన 24 శాతం షేర్లను శ్యాం పిట్రోడా వంటి వ్యక్తులు తీసుకున్నారని ఆయన విమర్శించారు. 50 లక్షలతో 2 వేల కోట్ల విలువైన నేషనల్ హెరాల్డ్ ఆస్తులను కొల్లగొట్టేందుకు ప్రయత్నించారని, 2013 నుంచి సోనియా, రాహుల్ మనీలాండరింగ్ కేసులో బెయిల్‌పై ఉన్న నిందితులని ఆయన తెలిపారు.

కాంగ్రెస్ హయాంలోనే ఈ కేసు విచారణ జరిగినప్పటికీ, బీజేపీని విమర్శించడం అసమంజసమని బండి సంజయ్ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని చేతబట్టి తిరుగుతూ కోర్టు తీర్పులను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ నాయకులు, ధైర్యం ఉంటే ఢిల్లీలోని టెన్ జన్‌పథ్‌లో ధర్నా చేయాలని సవాల్ విసిరారు. యంగ్ ఇండియా పేరుతో సోనియా, రాహుల్ దోపిడీ చేసినట్లు, అదే తరహాలో తెలంగాణలో రేవంత్ రెడ్డి కూడా దోపిడీ ప్రారంభించారని ఆరోపించారు. సుబ్రహ్మణ్య స్వామి వందల కేసులు వేసినప్పటికీ, ఈ కేసులకు బీజేపీకి సంబంధం లేదని, సోనియా, రాహుల్‌లకు శిక్ష తప్పదని హెచ్చరించారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకే నాణెం రెండు వైపులని, కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, కార్ రేసు, ఫామ్ హౌస్ కేసులు ఎందుకు మాయమయ్యాయని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలన వల్ల తెలంగాణలో పశ్చిమ బెంగాల్ తరహా అస్థిర పరిస్థితులు తలెత్తుతాయని, మమతా బెనర్జీలా రేవంత్ కూడా పరిస్థితిని నియంత్రించలేరని ఆందోళన వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో రాష్ట్ర ప్రభుత్వం హడావిడి చేస్తోందని, వక్ఫ్ ఆస్తుల వివరాలను, పేద ముస్లింలకు చేసిన సహాయాన్ని రేవంత్ వెల్లడించాలని డిమాండ్ చేశారు

మజ్లీస్ సమావేశాలను కాంగ్రెస్ పరోక్షంగా నిర్వహిస్తోందని, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆత్మను చంపుకుని మజ్లీస్‌కు ఓటేయొద్దని, ఓటింగ్‌కు దూరంగా ఉండొద్దని బండి సంజయ్ విజ్ఞప్తి చేశారు. తానెప్పుడూ అసభ్య పదజాలం వాడలేదని, కిషన్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా దూషిస్తుంటే, వారించకుండా చప్పట్లు కొట్టారని విమర్శించారు. రాష్ట్ర ఇంచార్జ్, ఉప ముఖ్యమంత్రి నిష్క్రియంగా ఉన్నారని, రాష్ట్రంలో రాజకీయ అవినీతిని బీజేపీ ఎండగడుతుందని హామీ ఇచ్చారు.





మరింత సమాచారం తెలుసుకోండి: