
గతంలో ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నోటిఫికేషన్ల కోసం పోరాటం చేశామని, గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అక్రమాలపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పులను ఒప్పుకుని పరీక్షలను రద్దు చేసిందని బాల్మూర్ వెంకట్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ నాయకులు గ్రూప్-1 నోటిఫికేషన్లను అడ్డుకునేందుకు నిరంతరం కేసులు వేస్తున్నారని, గతంలో తాము నియామకాలు చేపట్టలేకపోయినా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా ఉద్యోగాలు కల్పిస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీకేజీ, ఇంటర్ పేపర్ లీకేజీ సమయంలో విద్యార్థుల ఆత్మహత్యలపై కవిత ఒక్కమాట కూడా మాట్లాడలేదని, ఆమె ఆ సమయంలో వ్యాపారాల్లో నిమగ్నమై ఉన్నారని విమర్శించారు.
గ్రూప్-1 పరీక్ష కేంద్రాల ఏర్పాటులో టీఎస్‌పీఎస్‌సీ, ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేదని బాల్మూర్ వెంకట్ స్పష్టం చేశారు. కవిత పబ్లిక్ డొమైన్‌లో ఉన్న సమాచారాన్ని తప్పుగా వక్రీకరిస్తూ నిరుద్యోగులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కోఠి సెంటర్‌లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై, అలాంటివి నిజమైతే తోటి విద్యార్థులు, బీఆర్ఎస్ నాయకులు ఆ సమయంలో ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ ఉద్యమ సమయంలో నిరుద్యోగుల బలిదానాలను ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చి మోసం చేశారని, ఇప్పుడు మళ్లీ రాజకీయ లబ్ధి కోసం నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2017 నుంచి 2023 వరకు 14 వేల ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను నిరాశపరిచిన బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ నోటిఫికేషన్లను పరిష్కరించి, కోర్టు కేసులను సమర్థవంతంగా ఎదుర్కొని ఉద్యోగాలు కల్పిస్తుంటే ఆరోపణలు చేస్తోందని బాల్మూర్ వెంకట్ విమర్శించారు. కవిత ఆధారాలతో ముఖ్యమంత్రి వద్దకు వస్తే చర్చిస్తామని, తప్పులు జరిగితే సరిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు స్వార్థ రాజకీయాల కోసం నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారని, ఇలాంటి వైఖరి కొనసాగితే ప్రజలు, నిరుద్యోగులు తీవ్రంగా స్పందిస్తారని హెచ్చరించారు