తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల తిరుగుబాటుతోనే కూలిపోయిందని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ విమర్శలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో బంగారు తెలంగాణ కల కేసీఆర్ కుటుంబ సంపదగా మారిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు రాత్రింబవళ్లు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయని, బంగ్లాదేశ్ తిరుగుబాటుతో తెలంగాణను పోల్చడం అసంబద్ధమని కేటీఆర్ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చేయలేని పనులను సాధిస్తున్నారని, పేదల కోసం సన్న బియ్యం పంపిణీ వంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారని మల్లు రవి పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్య, మౌలిక సధుపాయాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలను ప్రవేశపెట్టిందని మల్లు రవి తెలిపారు. 200 కోట్లతో సమీకృత గురుకుల పాఠశాలలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేశారని, లక్ష మంది ఉద్యోగులలో బీసీ కుల గణనకు చట్టబద్ధత కల్పించారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలను తెలంగాణ తల్లి బిడ్డలు ప్రజాపాలన కేంద్రంగా రేవంత్ రెడ్డి పాలన సాగుతోందని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి వల్ల 16 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడ్డారని, రేవంత్ రెడ్డి భూభారతి ద్వారా రైతులకు, అధికారులకు సౌలభ్యం కల్పించారని తెలిపారు.


బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్‌ను ప్రజలకు అందుబాటులో లేని కోటగా మార్చారని, కానీ రేవంత్ హయాంలో దాని గేట్లను బద్దలు కొట్టి ప్రజలకు స్వేచ్ఛనిచ్చారని మల్లు రవి వివరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిన్నరలో 60 వేలకు పైగా ఉద్యోగాలు కల్పించిందని, ఇది బీఆర్ఎస్ పాలనలో సాధ్యం కాని విజయమని పేర్కొన్నారు. కేటీఆర్ విమర్శలపై తీవ్రంగా స్పందిస్తూ, రేవంత్ రెడ్డి నాలుగేళ్లు సీఎంగా కొనసాగుతారని, కాంగ్రెస్ మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీకి కంచ గచ్చి బౌలి భూములపై తప్పుడు సమాచారం ఇస్తున్నారని తెలంగాణ బీజేపీ నాయకత్వాన్ని విమర్శించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: