
అసలేం జరిగిందంటే, ఈ నెల 16న మల్లాం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. వెలిశెట్టి జల్లిబాబు అనే వ్యక్తి ఇంట్లో కరెంట్ పనులు చేస్తుండగా, అదే గ్రామానికి చెందిన పల్లపు సురేష్ అనే దళిత యువకుడు విద్యుదాఘాతంతో దుర్మరణం పాలయ్యాడు. భార్య, ఇద్దరు పిల్లలతో ఉన్న సురేష్ కుటుంబం కన్నీరుమున్నీరైంది. తమకు దిక్కెవరంటూ ఆ అభాగ్య కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతూ, జూన్ 17న గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దళిత సోదరులు ఆందోళనకు దిగారు. న్యాయం కోసం వారు చేసిన ఆక్రందన అది.
విషయం తెలుసుకున్న పిఠాపురం సీఐ శ్రీనివాస్ ఇరువర్గాలతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అంతా సద్దుమణుగుతుంది అనుకుంటున్న తరుణంలో, కథ అడ్డం తిరిగింది. గ్రామంలోని కొందరు అగ్రవర్ణ పెద్దలు రహస్యంగా సమావేశమై, దళితులను సామాజికంగా వెలివేయాలని అత్యంత అమానవీయమైన నిర్ణయం తీసుకున్నట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
ఈ చీకటి ఒప్పందం ఫలితంగా తమ బతుకులు రోడ్డున పడ్డాయని దళిత సోదరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ఎవరూ పనుల్లోకి పిలవడం లేదని, కనీసం తాము పాలు పోస్తామన్నా తీసుకోవడం లేదని వాపోతున్నారు. హోటళ్లకు వెళితే టీ, కాఫీ, టిఫిన్ కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. తమను ఊరి నుంచి వెలివేశారంటూ పలువురు దళితులు పిఠాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.
కాలదరి భాస్కర్రావు అనే వ్యక్తి మాట్లాడుతూ, తాను చేపలు అమ్ముతుంటే బుర్ర రాంబాబు, మేడిది రాజారావు అడ్డుపడి ఎవరూ కొనొద్దని చెప్పారని ఆరోపించారు. కలగపూడి అమోష అనే మరో బాధితుడు, బుర్ర నాని, బుర్ర మణి హోటళ్లలో టిఫిన్ ఇవ్వమని ముఖం మీదే చెప్పేశారని వాపోయాడు. ఆలపాటి చంద్రరావు మాట్లాడుతూ, మల్లిరెడ్డి రాంబాబు దుకాణంలో టీ అడిగితే, వాళ్ల పెద్దలు దళితులకు అమ్మొద్దని చెప్పారంటూ నిరాకరించారని తెలిపారు. చల్లా వెంకటరమణ పాల కేంద్రంలోనూ పాలు తీసుకోలేదని కాల్దారి సీను ఆవేదన వ్యక్తం చేశాడు.
అయితే, రెండో వర్గం వాదన మరోలా ఉంది. దళితులు చిన్న పొరపాట్లు జరిగినా తమపై తప్పుడు కేసులు బనాయించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారని, గతంలో ఇలాంటివి చాలా జరిగాయని, అందుకే వారితో పనులు చేయించుకోవడానికి భయపడి దూరంగా ఉంటున్నామని వారు అధికారుల వద్ద చెప్పినట్లు సమాచారం.
దళితులపై సాంఘిక బహిష్కరణ అంశం తీవ్రతరం కావడంతో కాకినాడ ఆర్డీవో ఎస్. మల్లిబాబు, పిఠాపురం సీఐ జి. శ్రీనివాస్, ఎస్సై జాన్ బాష రంగంలోకి దిగి దళిత కాలనీలో బాధితులను విచారించారు. అనంతరం ఇరువర్గాలతో చర్చలు జరిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్డీవో హామీ ఇచ్చారు.
• పవన్ కళ్యాణ్ ముందున్న పెను సవాల్:
సొంత నియోజకవర్గంలో, అదీ డిప్యూటీ సీఎం ప్రాబల్యం ఉన్న చోట ఇలాంటి అమానవీయ ఘటన చోటుచేసుకోవడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి పెను సవాల్‌గా మారింది. కేవలం అధికారుల హామీలతో సమస్య సమసిపోతుందా లేక క్షేత్రస్థాయిలో పరిస్థితి చక్కదిద్దడానికి ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ ఎలాంటి చొరవ తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. నాగరిక సమాజం తలదించుకోవాల్సిన ఈ సాంఘిక దురాచారానికి పిఠాపురంలో ముగింపు ఎప్పుడు, ఎలా పలుకుతారో వేచి చూడాలి.