తెలంగాణ జిల్లాల పునర్విభజనపై కేసీఆర్ పట్టుదలగా ఉన్నారు. రాష్ట్రావతరణ దినోత్సవమైన జూన్ 2 నాటికి కొత్త జిల్లాలను ఆవిష్కరించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఐతే కొన్నిజిల్లాల విభజనపై ఇంకా ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఐతే.. జిల్లాల పునర్విభజనకు సంబంధించిన చర్యలు మాత్రం చకచకా సాగుతున్నాయి. అటు అధికార పరంగా, ఇటు రాజకీయ పరంగా ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయి. 

రాజధాని హైదరాబాద్ కు సంబంధించి విభజన విషయమై సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. మిగతా అన్ని జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి దాదాపు ఓ స్పష్టత వచ్చిందనే చెప్పుకోవచ్చు. హైదరాబాద్ కు సంబంధించి నాలుగు భాగాలుగా విభజించాలా లేక రెండుగా విభజించాలా అనే విషయంపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయానికి రాలేదు. 

హైదరాబాద్ జిల్లా విభజనపై కేసీఆర్ మల్లగుల్లాలు..  


విస్తీర్ణం, జనాభా తోపాటు చుట్టుపక్కల ప్రాంతాలను కలుపుకుని నాలుగుగా విభజించాలన్న ప్రతిపాదన ఉంది. అయితే 90 శాతం ప్రాంతం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంటుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అధికారాలన్నీ మున్సిపల్ కౌన్సిల్ కే ఉంటాయి కాబట్టి... జిల్లా కలెక్టర్ల పాత్ర అంతగా ఉండబోదు. ఈ నేపథ్యంలో 4 జిల్లాలుగా విభజించడం ద్వారా పెద్దగా ఫలితం ఉండబోదని భావిస్తున్నారు.

రాజధాని నగరాన్ని రెండు జిల్లాలుగా విభజిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ ప్రతిపాదన పట్ల సుముఖంగా ఉన్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుత హైదరాబాదా జిల్లాతోపాటు రంగారెడ్డిజిల్లాలో మిగిలే కూకట్ పల్లి, శేరి లింగంపల్లి, మేడ్చల్, మల్కాజ్ గిరి, ఉప్పల్, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మహేశ్వరం ప్రాంతాలను కూడా కలిపి హైదరాబాద్ తూర్పు, హైదరాబాద్ పశ్చిమ జిల్లాలుగా ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: