రాజకీయాల్లో విమర్శలు కామన్.. ఒకళ్ల విధానాలను మరొకరు విమర్శిస్తుంటారు. తమ విధానాలే గొప్పవని రెచ్చిపోతుంటారు. ఇంతవరకూ బాగానే ఉంటుంది. కానీ కొందరు అవతలి వ్యక్తి భౌతిక రూపం ఆధారంగా కూడా విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి విమర్శలు వారి స్థాయిని వారికి తెలియకుండానే బయటపెడుతుంటాయి.
తాజాగా తెలంగాణ కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ ఇలాంటి విమర్శలే చేశాడు. టీఆర్ఎస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సచివాలయం కూల్చివేతకు ప్రయత్నాలు ప్రారంభించింది. కొత్త సచివాలయం కట్టాలని ఊవిళ్లూరినా ప్రస్తుతం అది మందగించింది. సచివాలయానికి వాస్తుదోషం ఉందని భావించడం వల్లే కేసీఆర్ అక్కడకు రావడం లేదన్న వాదనలూ ఉన్నాయి.
ఈ ఇష్యూను ప్రస్తావించిన పొన్నం.. వాస్తు దోషం ఉన్నందున సచివాలయాన్ని కూల్చేస్తానంటారు సీఎం కేసీఆర్... తెలంగాణకు వాస్తు దోషం.. కేసీఆర్ ముక్కే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కకు పెట్టి.. ఇతర పార్టీల నుంచి వచ్చిన తెలంగాణ ద్రోహులైన బంగారు తెలంగాణ బ్యాచ్ కు ప్రాధాన్యమిస్తున్నారని పొన్నం విమర్శించారు.
కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కావడం లేదని, బుక్ షాపుల్లో అబద్ధాల పుస్తకాలు అడిగితే టీఆర్‌ఎస్ మేనిఫెస్టో ఇస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఎన్నో విషయాల్లో హైకోర్టు, సుప్రీం కోర్టులు కొట్టేశాయని.. న్యాయపరమైన చిక్కులు లేకుండా జీవో లు తెచ్చే సత్తా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి లేదని పొన్నం మండిపడ్డారు. మిగిలిన విమర్శల సంగతేమో కానీ.. కేసీఆర్ ముక్కుపై విమర్శ మాత్రం అంత సబబుగా లేదు.