కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నిర్మాణాత్మక సంస్కరణల ప్రభావం సానుకూలంగా ఉందని, దీనివల్ల స్వల్పకాలిక ప్రయోజనాల కంటే, మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రయోజనాలు అధికంగా ఉంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.
పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ నిర్ణయాలు దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశాయని విమర్శిస్తున్న వారికి అదే స్థాయిలో భారీగానే సమాధాన మిచ్చారు కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లి. విమర్శలకు కేంద్రం ఘాటుగా సమాధానమిచ్చింది. జీఎస్టీ అమలులోకి వచ్చిన తొలి త్రైమాసికం లో దేశీయ స్థూల ఉత్పత్తి (జీడీపీ) దారుణంగా పడిపోయిన దరిమిలా ఆర్థిక వ్యవస్థపై భయాందోళనలు అవసరం లేదని భరోసా ఇస్తూ, ఉపాధి కల్పనకు ప్రణాళికను ప్రకటించింది. ప్రతిష్టాత్మక "భారత్ మాల" కు భారీ ఎత్తున నిధులు కేటాయించారు. ఈ మేరకు ఆర్థికశాఖ సోమవారం కేంద్ర సచివాలయంలో ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది.
వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) ఖాతా కింద ఒక్క సెప్టెంబర్ మాసంలో రూ.92.150 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారంనాడు ప్రకటించింది. ఇందులో సెంట్రల్ జీఎస్‌టీకి రూ.14,042 కోట్లు, రాష్ట్ర జీఎస్‌టీకి 21,172 కోట్లు వచ్చాయి. సమీకృత జీఎస్‌టీ వసూళ్లు రూ.48,948 కోట్లుగా ఉంది. ఇందులో రూ.23,951 కోట్లు దిగుమతులకు సంబంధించినవని ఆర్థిక శాఖ తెలిపింది. అపరాధ సుంకం రూ.7.988 కోట్లు అని, ఇందులో రూ.722 కోట్లు దిగుమతులకు సంబంధించిన అపరాధ సుంకమని తెలిపింది. సెప్టెంబర్ మాసానికి సోమవారం వరకూ 42.91 లక్షల వ్యాపార సంస్థలు ప్రాధమిక జీఎస్‌టీ, ఆర్-3బీ రిటర్స్స్ దాఖలు చేసినట్టు పేర్కొంది. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం జీఎస్‌టీ ప్రవేశపెట్టిన తొలిమాసం జూలైలో జీఎస్‌టీ వసూళ్లు రూ.95,000 కోట్లు కాగా, ఆగస్టులో అది రూ.91,000 కోట్లుగా ఉంది.
మంగళవారం సాయంత్రం ఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో అరుణ్ జైట్లీ మాట్లాడారు. సామాన్యుడి జీవనం మెరుగు పడుతోందని, ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందని, స్వయం సమృద్ధి పెరుగు తోందని, కరెంట్ అకౌంట్ లోటు 2% కన్నా తక్కువతో సురక్షిత స్థాయిలో ఉందని ఆర్ధిక మంత్రి వెల్లడించారు. ఈ ఆదాయం తోనే:
1. భారత దేశమతటా మౌలిక వసతుల కల్పన,
2. నిరుద్యోగ నిర్మూలనా జరపటానికి క్రింద వివరించిన ప్రణాళిక
సిద్ధం చేశామని అన్నారు. ఇవన్నీ దేశ భవిష్యత్ ను పరిగణనలోకి తీసుకొని చేసే దీర్ఘకాలిక ప్రయోజనాలని ఆయన జిఎస్టి ని, డిమోనెటైజషన్ ను విమర్శించేవారికి సమాధానంగా బదులిచ్చారు.
భారత్ మాల : దేశంలో ఉపాధి కల్పనే ధ్యేయంగా రోడ్లు, రవాణా రంగాలకు సంబంధించి కేంద్రం ఇదివరకే ప్రకటించిన భారత్ మాల పథకానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. దేశాన్ని చుట్టివచ్చేలా 34,800 కిలోమీటర్ల రహదారిని ‘భారత్ మాల’ లో భాగంగా నిర్మిస్తారు. ఈ ప్రాజెక్టు పూర్తి వ్యయం రూ.10 లక్షల కోట్లు కాగా, అందులో సగం రూ.5.34 లక్షల కోట్లును విడుదల చేయనున్నట్లు అధికారులు చెప్పారు. తద్వారా 14.20 కోట్ల మందికి ఉపాధి లభించనుందని వివరించారు. దీనితోపాటు ప్రతిష్టాత్మక మెగా హైవే ప్లాన్‌కు కూడా ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న జాతీయ రహదారుల్లో తొమ్మిదింటిని రూ.6,258 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు.
మూడేళ్లుగా దేశం అభివృద్ధిపథంలో : ప్రెజెంటేషన్‌కు ముందు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడుతూ, తాము చేపట్టిన సంస్కరణలు తప్పక మంచి ఫలితాలిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. "ఇటీవల విడుదలైన జీడీపీ గణాంకాల్లో వృద్ధిరేటు పడిపోయింది నిజమే. అయితే అందుకు ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే, భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. గడిచిన మూడేళ్లుగా ఇండియా, ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశంగా నిలిచింది. జీఎస్టీ లాంటి భారీ సంస్కరణలు చేసినప్పుడు మొదట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నా, భవిష్యత్తులో తప్పక మంచి ఫలితాలు చూడొచ్చు" అని జైట్లీ చెప్పారు.
మేము మా ప్రభుత్వం సిద్ధం గానే ఉన్నాం: గడిచిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధిరేటు తగ్గిన దరిమిలా తిరిగి వృద్ధి బాట పట్టేలా అవసరమైన చర్యలు తీసుకునేందుకు మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని జైట్లీ తెలిపారు. ఏం చెయ్యాలనే దానిపై ఇటు ఆర్థిక శాఖలోను, అటు ప్రధాని నరేంద్ర మోదీ తోనూ నిత్యం మాట్లాడుతూనే ఉన్నామన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నేటి జైట్లీ ప్రెస్‌మీట్‌కు అధిక ప్రాధాన్యం సంతరించుకోవడం గమనార్హం.