ఓ చోట వరదలు వెల్లువెత్తి ఊళ్లకు ఊళ్లు మునిగిపోతాయి..! మరోచోట తీవ్ర కరవు కాటకాలు తాండవిస్తుంటాయి. ఓ ప్రాంతంలో ప్రజలు తాగునీటికి కటకటలాడుతుంటారు..! మరోచోట ప్రజలు వర్షాలతో తడిసి ముద్దవుతుంటారు. ఓవైపు వానల దరువు.. మరోవైపు చినుకే కరవు. కొన్ని నదుల్లో పుష్కలంగా ప్రవహిస్తున్న నీరు పూర్తిగా ఉపయోగపడక వృథాగా సముద్రం పాలవుతుంటే.. మరికొన్ని నదులు చుక్క నీరు లేక ఎండిపోతున్నాయి. ఇదీ భారతదేశ జలవనరుల వ్యవస్థ తీరు. ఈ దురవస్థ ఎల్లకాలం కొనసాగాల్సిందేనా..? నీటిజాడ లేక ఎడారైపోతున్న ప్రాంతాలకు మిగులు జలాల్ని తరలించి కరవును పారదోలే అవకాశమే లేదా..? అన్న ప్రశ్నలకు ఇప్పుడు వినిపిస్తున్న ఒకే ఒక్క సమాధానం.. “నదుల అనుసంధానం”.
ఇన్నాళ్లూ చర్చలకే పరిమితమైన నదుల అనుసంధానం వ్యవహారంలో కదలిక కనిపిస్తోంది. గోదావరి నుంచి నీటిని మళ్లించేందుకు కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చిన కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ.. దాని కార్యాచరణపై దృష్టి సారించింది. ఇక కొత్త ప్రతిపాదనలపై దక్షిణాది రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయనే దానిపైనే నదుల అనుసంధానంలో తదుపరి అడుగులు పడనున్నాయి.
నదుల అనుసంధానంపై ఉన్న ప్రతిపాదనలను ఒకసారి పరిశీలిస్తే.. దక్షిణాదిన ఒడిశాలోని మహానది నుంచి తమిళనాడులోని గుండార్ డ్యాం వరకు మొత్తం తొమ్మిది అనుసంధానాలను జాతీయ జల అభివృద్ధి సంస్థ ప్రతిపాదించింది. మహానది, గోదావరి నుంచి నీటిని మళ్లిస్తే కానీ ఈ అనుసంధానాలు కార్యరూపం దాల్చవు. అయితే.. మహానదిలో మిగులు జలాలు లేవని ఒడిశా తేల్చి చెప్పింది. గోదావరిలో మిగులు జలాలు లేవని, మహానది నుంచి మళ్లిస్తే తమకేమీ అభ్యంతరం లేదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కూడా స్పష్టం చేసింది. పునర్విభజన తరువాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఇదే వైఖరిని కొనసాగించాయి.
1980ల్లో జరిగిన అధ్యయనం ఆధారంగా ఇచ్చంపల్లి వద్ద మిగులు జలాలు ఉన్నాయని జాతీయ జల అభివృద్ధి సంస్థ చెబుతోంది. అయితే తిరిగి అధ్యయనం చేయాలన్న తెలంగాణ ఒత్తిడి మేరకు.. జాతీయ జల అభివృద్ధి సంస్థ 2016లో అధ్యయనం నిర్వహించి.. నీటి లభ్యత తగ్గిందని పేర్కొంది. ఒడిశాతో పలు దఫాలుగా కేంద్రం చర్చలు జరిపినా ఇప్పటివరకు వ్యవహారం ఓ కొలిక్కి రాలేదు. దీంతో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ రాష్ట్రాలతో ప్రాథమికంగా చర్చించిన తరవాత జాతీయ జల అభివృద్ధి సంస్థ ఓ ప్రతిపాదనను తయారు చేసింది. దీని ప్రకారం గోదావరి నదిపై
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన తుపాకుల గూడెం బ్యారేజి- దుమ్ముగూడెం ఆనకట్ట మధ్యలో అకినేపల్లి వద్ద 72.50 మీటర్ల పూర్తిస్థాయి నీటిమట్టంతో బ్యారేజి నిర్మాణం చేపడతారు. దీని నిల్వ సామర్థ్యం 20.83 టీఎంసీలు. ఇక్కడినుంచి నీటిని ఎత్తిపోతల ద్వారా నాగార్జునసాగర్‌కు.. అక్కడి నుంచి పెన్నానదిపై ఉన్న సోమశిలకు మళ్లిస్తారు. సోమశిల నుంచి కావేరిపై ఉన్న గ్రాండ్ ఆనకట్టకు 57 టీఎంసీల నీటిని మళ్లించడం దీని ప్రధాన లక్ష్యం.
ఈ మేరకు ఢిల్లీలో జాతీయ జల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నదుల అనుసంధానంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ 14వ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన గోదావరి-కృష్ణా అనుసంధానం గురించి కేంద్ర మంత్రి గడ్కరీ ప్రస్తావించారు. మహానదిలో మిగులు జలాలు ఎంతో ఇంకా తేలనందున.. ప్రస్తుతం తెలంగాణలోని అకినేపల్లి నుంచి నాగార్జునసాగర్ అక్కడి నుంచి పెన్నా ఆపైన పాలార్ కావేరికి అనుసంధానం చేసే ప్రతిపాదనపై దృష్టి సారించినట్లు కేంద్ర మంత్రి వివరించారు. ఈ ప్రాజెక్టు వల్ల నాలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈ కొత్త ప్రతిపాదనపై ఆంధ్రప్రదేశ్ తన అభిప్రాయాలు వెల్లడించలేదు. ఈ ప్రతిపాదన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు దాదాపు 80 టీఎంసీల వరకు నీళ్లు లభిస్తాయని భావిస్తున్నారు. నాగార్జునసాగర్ కుడి కాలువకు, పెన్నాకు ఈ నీళ్లు దక్కనున్నాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ కు ఈ అనుసంధానం వల్ల ప్రయోజనమే అని భావిస్తున్నా.. ప్రస్తుతానికి ఏ అభిప్రాయమూ వెల్లడించకూడదన్న ఉద్దేశంతో.. కేవలం అధికారులను మాత్రమే ఈ సమావేశానికి ప్రభుత్వం పంపింది.
మరోవైపు.. సమావేశానికి హాజరైన తెలంగాణ వ్యక్తం చేసిన అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుంటే గోదావరిపై అకినేపల్లి వద్ద బ్యారేజి నిర్మించి కావేరినదిపై గ్రాండ్ ఆనకట్ట వరకు నీటిని మళ్లించే పథకం ముందుకు కదలనట్లే కనిపిస్తోంది. నదుల అనుసంధానానికి తాము అనుకూలమే అని చెబుతూనే.. నీటి లభ్యత, ముంపు ఇలా అనేక అంశాలపై సందేహాలు వ్యక్తం చేసింది. అంతే కాక.. మహానది-గోదావరి అనుసంధానం మొదట చేపట్టిన తర్వాతే తాజా ప్రతిపాదన చేపట్టాలనేది తెలంగాణ అభిప్రాయం. అకినేపల్లి అనుసంధానం చేపట్టడానికి ముందే మహానది-గోదావరి అనుసంధానాన్ని మొదట చేపట్టాలని తెలంగాణ తరపున హాజరైన ఆ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు సూచించారు. అయినా.. మహానది నుంచి నీటిని మళ్లించడానికి ఒడిశా అంగీకరించకపోవడం వల్లే ప్రత్యామ్నాయంగా ప్రస్తుత ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు జాతీయ జల అభివృద్ధి సంస్థ తన నివేదికలో స్పష్టం చేసింది.నదుల అనుసంధానానికి రాష్ట్రాలు అంగీకరించడం ఒక సమస్య అయితే.. నిధుల సమీకరణ మరో పెద్ద సమస్య. అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి కేంద్రం నిధులు సమకూర్చినా.. ఒకే రాష్ట్రంలో రెండు నదుల అనుసంధానం ద్వారా చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం నిధులివ్వదని జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నదుల అనుసంధానంలో మూడు, నాలుగు రాష్ట్రాలకు ప్రయోజనం కలిగించే వాటితో పాటు ఒకే రాష్ట్రంలో
అనుసంధానానికి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించిన నివేదికలు పంపితే వివిధ ఆర్థిక సంస్థలకు పంపి రుణాలు వచ్చే ఏర్పాటు చేస్తామని.. ప్రపంచబ్యాంకు, ఏడీబీ, జైకా తదితర సంస్థలు తక్కువ వడ్డీకి రుణాలిస్తున్నాయని పేర్కొన్నట్లు తెలిసింది. నదుల అనుసంధానానికి సంబంధించిన ప్రాజెక్టులకు కూడా కేంద్రం 90 శాతం ఇస్తే రాష్ట్రాలు పది శాతం భరించడమా.. లేక 60:40 ప్రకారమా అన్నది ఆర్థిక శాఖ పరిశీలనలో ఉంది.గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదుల అనుసంధానంపై అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం వ్యక్తమైన తర్వాతే ముందడుగు వేస్తామని కేంద్ర జలవనరులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ఇందుకోసం త్వరలో సంబంధిత ఆరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో నదుల అనుసంధానంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు అనుకూలంగా.. మరికొన్ని రాష్ట్రాలు వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి దీనిపై చర్చించి వారి అభిప్రాయాల మేరకు ముందుకు వెళ్లాలన్నది కేంద్రం ఆలోచన.
ఇలా నదుల అనుసంధానంపై అడుగులు పడుతున్నట్లు కనపడుతున్నా.. ఇప్పట్లో ఇది సాకారమవుతుందా అంటే.. అనుమాన పడాల్సిందే. ఎందుకంటే.. ఏ ప్రతిపాదన అయినా కార్యరూపం దాల్చినపుడే ఫలితం ఉంటుంది. నదుల అనుసంధానంపై దశాబ్దాల తరబడి చర్చలు, సంప్రదింపులు, అధ్యయనాలే తప్ప అవి కార్యరూపం దాల్చడం లేదన్నది నిష్ఠుర సత్యం. దీనికి కళ్ల ముందు కనపడుతున్న ప్రత్యక్ష ఉదాహరణే.. కెన్-బెట్వా నదుల పరిస్థితి.
అనుసంధానాల్లో అతి చిన్నది కెన్-బెట్వా నదుల సంధానం. దీన్ని 2009లో అప్పటి కేంద్ర ప్రభుత్వం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. అన్ని అనుమతులూ వచ్చాయి. గత జూన్‌లో పెట్టుబడి అనుమతీ లభించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలోని వెనకబడిన ప్రాంతాలు ప్రత్యేకించి బుందేల్‌ఖండ్‌కు ప్రయోజనం కలిగించే ఈ ప్రాజెక్టుపై గతంలో జలవనరుల శాఖ మంత్రిగా ఉమాభారతి ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఈ పథకాన్ని ‘ఫాస్ట్ ట్రాక్’లో పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. అయినా ఇప్పటికీ ప్రాజెక్టు మాత్రం ప్రారంభం కాలేదు. చివరకు రెండు దశల్లో పథకాన్ని చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ప్రతి రెండు నెలలకోసారి నదుల అనుసంధానంపై జరిగే ప్రత్యేక కమిటీ సమావేశంలో దీని గురించి చర్చిస్తూనే ఉన్నారు. ఇంత చేసినా.. వ్యవహారం కాగితాల దశే దాటడం లేదు.ఇలాంటి నేపథ్యంలో వివిధ రాష్ట్రాల్లో నీటి లెక్కలను తేల్చి.. భూమిని సేకరించి.. ఆర్థిక వనరులను సమీకరించి నదుల అనుసంధానం ఏమేరకు చేస్తారనేదానికి కాలమే సమాధానం చెప్పాలి.