తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో వరుసగా రెండోసారి గెలిచి అధికార పీఠం దక్కించుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తోన్న తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపులో పలు షాకులు ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్‌కు జంపింగ్ ఎమ్మెల్యేలతో కలుపుకుంటే మొత్తం 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కనీసం 40 మంది సిట్టింగ్‌లను పక్కన పెట్టేస్తారని తెలుస్తోంది.
వచ్చే ఎన్నికల తర్వాత చాలా మంది ఆశావాహులు తమకు మంత్రి పదవులు వస్తాయని ఆశిస్తున్నారు. ఈ లిస్టులో దాదాపు ఆరేడుగురు మంది ఎంపీలే ఉన్నారు. గుత్తా సుఖేందర్‌రెడ్డి, కవిత, వినోద్‌కుమార్, బాల్క సుమన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది టీఆర్ఎస్ ఎంపీలు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచి తెలంగాణ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకోవాలని చూస్తున్నారు.
మరి ఇప్పుడు కేబినెట్‌లో ఉన్న వాళ్లకు రేపు కేబినెట్‌లో బెర్త్ ఆశిస్తోన్న వాళ్లకు మంత్రి పదవులు ఇవ్వడం సాధ్యం కాదు. ఈ క్రమంలోనే కొందరు సీనియర్లు, మంత్రులను కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో స్టేట్ పాలిటిక్స్ నుంచి చాలా తెలివిగా సైడ్ చేస్తున్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది. కొందరు మంత్రులను వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీ చేయించడం ఒక ఎత్తు అయితే, కొందరు సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లే ఇవ్వరట. మరి కొందరు సీనియర్లను స్థానాలు మార్చుతున్నారు.
ఇంటర్నల్ టాక్ ప్రకారం కేటీఆర్‌కు పోటీ లేకుండా మేనళ్లుడు హరీష్‌ను ఇక్కడ నుంచి తప్పించేందుకు ఆయన్ను మెదక్ ఎంపీగా పోటీ చేసి బీజేపీతో పొత్తు ఉంటే సెంట్రల్ మినిస్టర్ పదవి ఇచ్చేలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మంత్రి ఈటెల రాజేందర్‌ను కరీంనగర్ ఎంపీగా, కడియం శ్రీహరిని వరంగల్ ఎంపీగా పంపుతారని సమాచారం. ఇక ఎర్రబెల్లిని జనగామకు మార్చడం, మంత్రి జగదీష్‌రెడ్డిని సూర్యాపేట నుంచి ఎల్బీనగర్‌కు మార్చడం చేయవచ్చంటున్నారు.
ఇక హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి వంటి వారికి టికెట్ ఇవ్వకుండా ఇంటికే పరిమితం చేయాలని కూడా నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఇక, ప్రస్తుత హోం మంత్రి నాయిని నరిసింహారెడ్డిని రాజ్యసభకు పంపేలా ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ఏదేమైనా కేసీఆర్ మార్పులు, చేర్పులు మామూలుగా ఉండేలా లేవు. వచ్చే ఎన్నికల వేళ టీఆర్ఎస్‌లో చాలా మందికి పెద్ద షాకులు తప్పేలా లేవు.