కేంద్రం పెత్తనంపై కేసీఆర్ మరోసారి నిప్పులు చెరిగారు. స్వతంత్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా ఇంకా రాష్ట్రాలను కేంద్రం అణిచివేయడమేంటని కేసీఆర్ నిలదీశారు..
గతంలో ఇలా కేంద్రంపై బహిరంగంగా దాడి చేసిన వ్యక్తి ఎన్టీఆరే..కేంద్రం మిథ్య అంటూ ఆయన అప్పట్లోనే ఎలుగెత్తారు. మళ్లీ ఇన్నాళ్లకు ఓ తెలుగు వ్యక్తి చాలా క్లారిటీగా కేంద్రాన్ని నిలదీస్తున్నారు.
రాష్ట్రాలలో రిజర్వేషన్లపై కేంద్రం పెత్తనమేమిటని కేసీఆర్ మరోసారి ప్రశ్నించారు. ప్రగతి భవన్ లో ఆయన వరుసగా రెండో రోజు మాట్లాడారు. ఏ రాష్ట్రం పరిస్ధితిని బట్టి ఆ రాష్ట్రం రిజర్వేషన్లు ఖరారు చేసుకునే అధికారం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఆఖరికి నరేగా కూలీలకు కూడా డబ్బులు ఢిల్లీలో ఇవ్వాలా అని కేసీఆర్ అన్నారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయాలకు మద్దతు పెరుగుతోందన్నారు.
71 ఏళ్ల ప్రజాస్వామ్యంలో మనం చెప్పుకునే ఫెడరల్ వ్యవస్థ అసలు ఉందా అని కేసీఆర్ ప్రసంగించారు. విద్యా వ్యవస్థను, వైద్యాన్ని రాష్ట్రాలకు అప్పగించాలని కేసీఆర్ అన్నారు.
తాను చేసిన మూడో ఫ్రంట్ ప్రతిపాదనకు పెద్ద ఎత్తున మద్దతు వస్తున్నదని కేసీఆర్ తెలిపారు. మహారాష్ట్ర నుంచి ఎంపీలు ఫోన్ చేసి మద్దతు ప్రకటించారని చెప్పారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫోన్ చేసి అభినందించారని కేసీఆర్ చెప్పారు. ప్రగతి భవన్ కు కేసీఆర్ ను అభినందించేందుకు జనం పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
గ్రామాలలో రోడ్లకు ప్రధానికి సంబంధం ? గ్రామాలలో రోడ్లకు ప్రధానికి సంబంధం ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రాలలో ప్రభుత్వాలు లేవా? అని ప్రశ్నించారు. విద్యా, వైద్యం, రోడ్లు, రిజర్వేషన్లు అన్నీ రాష్ట్రాలకు సంబంధించిన విషయమని దీనిపై కేంద్రం పెత్తనమేమిటని కేసీఆర్ అన్నారు. ఢిల్లీ..ఢిల్లీ..ఏం ఢిల్లీ.. పెత్తనం ఏమిటి? దాని గొప్పదనమేమిటని ఆయన నిలదీశారు.