ఏదేశ అభివృద్దికైనా ఆదేశ యువతే జీవనాడి. అలాగే భారతీయ యువత కూడా. మనదేశం పురోగ వేగం చైనా కంటే అధికం అని చెప్పటానికి కారణం మనదేశంలో యువత శాతం అధికంగా ఉండటమే. శత్రుదేశాలు మనదేశాన్ని నిర్వీర్యం చేయటానికి యుద్ధాలే చేయనవసరం లేదు. మన యువతను కేంద్రంగా చేసుకొని నార్కోటిక్స్ సరపరా చేస్తూ అశ్లీల వీడియోలు సాహిత్యం మన యువతపై కృమ్మరిస్తే సగంపని అయిపోయినట్లే. ఇదోరకమైన పరోక్ష అతి ప్రమాదకర భయానక యుద్ధమే.
అలాంటి యువతపై మత్తు పదార్ధాల ప్రభావాన్నిఅరికట్టటానికి ప్రభుత్వాలెంత ప్రయత్నిస్తున్నా వాటి వెనుక ఉన్న దెశీయ అంతర్జాతీయ రాజకీయశక్తుల వల్ల ఆయా ప్రయత్నాలు అనుకున్నంత మేరకు ఫలితాల నివ్వటం లేదు. అంతర్జాతీయ మాఫియా మృగాల ముఠాల చేతికి చిక్కిన యువత గిలగిలా కొట్టుకుంటుంది.
గత ఏడాది భారీ మొత్తంలో మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. గత ఐదేండ్లలో ఎన్నడూ లేనంతగా మాదక ద్రవ్యాలు పట్టుబడినట్లుగా మాదకద్రవ్యాల నిరోధక మండలి (ఎన్‌సీబీ) విడుదల చేసిన తాజా నివేదికను చూస్తే అర్థమవుతున్నది. శనివారం కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆ నివేదికను విడుదల చేశారు.
2017లో రికార్డు స్థాయిలో 3.6 లక్షల కిలోల మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయని, ఇవి గత ఐదేండ్లతో పోల్చు కుంటే 300 శాతం అధికంగా ఉన్నా యని ఎన్‌సీబీ పేర్కొంది. గత ఏడాది హెరాయిన్ తయారీకి విని యోగించే ఓపియం 2,551 కిలోలు, హెరాయిన్ 2,146 కిలోలు, గంజాయిలాంటి మత్తుపదార్థాలు 3,52,379 కిలోలు, హషీష్ 3,218 కిలోలు, కొకైన్ 69 కిలోలు పట్టుకున్నారు. 2013 తర్వాత ఇంత భారీగా పట్టుబడటం ఇదే మొదలు. 2017లో 3.60 లక్షల కిలోల మత్తుపదార్థాలు పట్టుబడగా, 2016 లో 3.01 లక్షల కిలోలు, 2015లో లక్ష కిలోలు, 2014లో 1.10 లక్షల కిలోలు, 2013లో లక్ష కిలోలు ఉన్నట్లు ఎన్‌సీబీ నివేదిక వెల్లడించింది.
చైనా నుంచి ముంచుకొస్తున్న ముప్పు చైనా వైట్
చైనా నుంచి భారత్ కి మరో ప్రమాదం వచ్చిపడింది. భారత్ ను దెబ్బతీసేందుకు పాకిస్తాన్ తో పాటు చైనా కూడా ఎప్పటికప్పుడు సరికొత్త పద్ధతుల్లో ప్రయత్నిస్తోంది. మార్ఫిన్ లేదా హెరాయిన్ కన్నా వంద రెట్లు శక్తివంతమైన, ప్రమాదకరమైన డ్రగ్ 'చైనా వైట్' ప్రస్తుతం ఈ డ్రగ్ మయన్మార్ మీదుగా భారత నార్కోటిక్స్ మార్కెట్ లోకి ప్రవేశించింది.
ఈదొక భయంకర డ్రగ్ దీనికి మన డిల్లీ యువత బాగా అలవాటు పడినట్లు తెలుస్తోంది. డ్రగ్ స్మగ్లర్లు ఈ డ్రగ్ ను మయన్మార్ నుంచి మిజోరామ్, మణిపూర్ మీదుగా ఢిల్లీకి చేరవేస్తున్నట్లు సమాచారం. సబ్బు పెట్టెలు, బొమ్మలు, బూట్లు, కాస్మోటిక్స్ వస్తువుల ద్వారా ఈ చైనా వైట్ డ్రగ్‌ను అక్రమంగా రవాణా చేస్తున్నారు. విమానమార్గాల్లో కూడా ఈ భయంకరమైన డ్రగ్ భారత్ లో ల్యాండ్ అవుతోంది.
మొన్నటి వరకు కెనడా, అమెరికాలకే పరిమితమైన ఈ ‘చైనా వైట్' ఇప్పుడు భారత మార్కెట్ లోకి ప్రవేశించడంపై కేంద్ర ప్రభుత్వం కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే ఈ డ్రగ్ అధిక డోస్ తీసుకున్న కారణంగా కెనడా లో రోజుకు ఇద్దరు చొప్పున మరణిస్తున్నారు. మోతాదుకు మించితీసుకుంటే, మరణమే. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పాప్ గాయకుడు ప్రిన్స్ కూడా ఈ డ్రగ్‌ను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల మరణించినట్లు అమెరికా వైద్యులు ధ్రువీకరించారు.
ఒక్క 2016లోనే అమెరికాలో 20100 మంది ఈ డ్రగ్ ఓవర్ డోస్ కారణంగా మరణించారు. గతంతో పోలిస్తే మృతుల సంఖ్య 540 రెట్లు పెరిగిందని అమెరికా పోలీసు అధికారు లు చెబుతున్నారు. మయన్మార్, లావోస్, థాయ్‌లాండ్ మధ్యనున్న గోల్డెన్ ట్రయాంగిల్ ప్రాంతంలో దీన్ని ఎక్కువగా పండిస్తున్నారు. గంజాయిని అక్రమంగా పండిస్తున్న దేశాల్లో మయన్మార్ ప్రపంచం లోనే రెండవ స్థానాన్ని ఆక్రమించింది.
ఒక్క 2006 నుంచి 2013 మధ్య కాలంలోనే ఆ దేశంలో గంజాయి సాగు రెండింతలు పెరిగింది. గసగసాల పంటకు జోడించి చైనా వైట్ ను సాగు చేస్తారు. హెరాయిన్ తరహా లోనే ఈ డ్రగ్ ను ముక్కుతో పీల్చడం, ఇంజెక్షన్ ద్వారా రక్తంలోకి ఎక్కించుకోవడం చేస్తుంటారు.
చైనా వైట్ గా పిలిచే ఈ డ్రగ్ ను “ఫెంటానిల్” అనే మొక్కల నుంచి తయారు చేస్తారు. గసగసాల కు ఫెంటానిల్ మొక్కల ఆకులను, కొద్ది మోతాదులో హెరాయిన్‌ను కలిపి ఈ చైనా వైట్ డ్రగ్ ను తయారు చేస్తున్నారు. మయన్మార్ నుంచి భారీ ఎత్తున సరఫరా అయిన ఈ చైనా వైట్ డ్రగ్ ను మిజోరామ్ పోలీసులు పట్టుకున్నారు. అంతకు ముందు ఢిల్లీలో మన పోలీసులు కూడా 12 కేజీల చైనా వైట్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో రూ.50 కోట్లు ఉంటుందని అంచనా.