ఆంధ్రప్రదేశ్ లో కొన్ని రోజుల నుంచి రాజకీయాల్లో పెను దుమారం చెలరేగుతుంది. మొన్నటి వరకు మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ,టీడీపీ ల మద్య వైరం మొదలైంది. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ చట్టాపట్టలేసుకొని తిరిగారు..కానీ ఇప్పుడు అదీ బెడిసి కొట్టింది. వీలు చిక్కినప్పుడల్లా జనసేన అధినేత పవన్ కళ్యాన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మరోసారి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాన్.
గతంలో తాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ విషయంలో ఏ తప్పు చేశారో, ఇప్పుడు అమరావతి విషయంలోనూ చంద్రబాబు అదే తప్పు చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హైదరాబాద్ ని ఎంతో గొప్పగా అభివృద్ది చేశానని చెబుతున్న బాబు కేవలం సైబరాబాద్ ను మాత్రమే అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.
ఆపై ఔటర్ రింగ్ రోడ్డుతో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కగా, అంతే విధ్వంసం కూడా జరిగిందని, చిన్న రైతుల నుంచి భూమిని లక్షలకు కొన్న కొందరు బడాబాబులు కోట్లకు పడగలెత్తారని అన్నారు. దాంతో ఆంధ్రా ప్రజలపై తెలంగాణ వాసుల కోపానికి కారణం అదేనని, ఇప్పుడు అమరావతి విషయంలోనూ ఇదే జరుగుతోందని పవన్ ఆరోపించారు.
ప్రస్తుతం ముఖ్యమంత్రి అమరావతిపై ప్రత్యేక దృష్టి సారించడంతో..రాయలసీమ, కళింగ ఉద్యమాలు వస్తాయని హెచ్చరించిన ఆయన, పాలకుల తప్పిదాల కారణంగానే అస్థిత్వ పోరు మొదలవుతోందని చెప్పారు. మంగళగిరి అటవీ ప్రాంతంలో 1800 ఎకరాల్లో రాజధాని నిర్మించవచ్చని చెప్పిన చంద్రబాబు, అన్ని వేల ఎకరాలు ఎందుకు సమీకరించారని ప్రశ్నించారు.