ఆడపిల్లలకు ఇంటా బయటా రక్షణ లేకుండా పోతోంది. చదువుల కోసం ఇల్లుదాటే ఆడపిల్లను కబళించేందుకు అన్ని చోట్ల కామాంధులు కాచుకుని కూర్చుంటున్నారు. అలాంటి ఓ దారుణ సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. బాలికల స్నానాల గదిలో సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్ చేస్తూ దొరికిపోయిన ఓ కోచింగ్ సెంటర్ నిర్వాహకుడి ఉదంతం అనంతపురంలో కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. అనంత పురం జిల్లా కేంద్రంలో సంజీవరాయుడు లోటస్ ఆకాడమి అని కోచింగ్ సెంటర్ పెట్టాడు. పదోతరగతి తర్వాత రాసే ఎంట్రన్స్ పరీక్షలకు కోచింగ్ ఇస్తానని ప్రకటించారు. వందల సంఖ్యలో అమ్మాయిలను హాస్టల్ లో చేర్చుకున్నాడు. అంతవరకూ బాగానే ఉంది. కానీ అక్కడే పుట్టింది పాడు బుద్ది. అమ్మాయిల బాత్రూమ్ లో సీక్రెట్ కెమేరా పెట్టించి రికార్డు చేయడం ప్రారంభించాడు.
ఓ అమ్మాయికి ఈ విషయంలో అనుమానం వచ్చింది. బాత్రూమ్ లో బూటు మాటున దాచిన కెమేరా ఫోన్ ఆ అమ్మాయి కంట్లో పడింది. అప్పటికే ఆ సెల్ ఫోన్ లో కొన్ని చిత్రాలు రికార్డు అయిన విషయం గుర్తించి పోలీసులకు పట్టించింది. దీంతో అనంతపురం పోలీసులు సదరు కోచింగ్ సెంటర్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.
ఆ ఫోన్ నుంచి తీసిన చిత్రాలను గుర్తిస్తున్నారు. సంజీవరాయుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. బాలికల తలిదండ్రులను పిలిపించి లోటస్ అకాడమి కోచింగ్ సెంటర్ నుంచి విద్యార్థులందరినీ ఇళ్లకు పంపించేశారు. మరి ఈ దుర్మార్గుడు ఇలా ఎన్నాళ్ల నుంచి చేస్తున్నాడో.. ఎందరి వీడియోలు అతని వద్ద ఉన్నాయో.. నాలుగు తగిలిస్తే కానీ తెలియదు మరి.