చంద్రబాబునాయుడుకు కేంద్రప్రభుత్వం త్వరలో షాక్ ఇవ్వనున్నదా ? వందల సంవత్సరాలుగా రాష్ట్రప్రభుత్వం ఆధీనంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ది చెందిన తిరుమల తిరుపతి దేవస్ధానం (టిటిడి)ను తన పరిధిలోకి తీసుకోవటానికి కేంద్రం పావులు కదుపుతోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
తిరుమల తిరుపతి దేవస్దానం పై కేంద్రప్రభుత్వం కన్నుపడినట్లే కనబడుతోంది. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ అవే అనుమానాలు మొదలయ్యాయి.
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందిన దేవాలయం అన్న సంగతి అందరికీ తెలిసిందే. తిరుమలలోని కొన్ని కట్టడాల ప్రస్తుత స్ధితి, ఆభరణాలను భద్రపరచే విషయం, నిధుల వ్యయం తదితరాలపై నేరుగా ప్రధానమంత్రి కార్యాలయంకు ఫిర్యాదు అందిదట. అందిన ఫిర్యాదుల ఆధారంగా పిఎంఓ వెంటనే కేంద్ర పురావస్తు శాఖకు ఆదేశాలు ఇచ్చింది. వెంటనే శాఖ ఉన్నతాధికారులు కూడా రంగంలోకి దిగేశారు.
వివరాలు కోరిన పురావస్తు శాఖ
తిరుమలలోని ఆలయాల సంఖ్య, నిర్వహణ విధానాలు, కూలుస్తున్న నిర్మాణాల వివరాలు, ఆభరణాల వివరాలు, నిధుల లెక్కల వివరాలను వెంటనే తమకు అందచేయాలంటూ టిటిడి ఇవో సింఘాల్ కు లేఖ రాయటంతోనే అందరిలోనూ అనుమానాలు మొదలయ్యాయి. తిరుమలలో చారిత్రాత్మక కట్టడాలు చాలానే ఉన్నాయి. అందులో కొన్ని జనాలు సందర్శనకు కూడా నోచుకోవటం లేదు. కారణమేమిటంటే అవన్నీ పాడుపడిపోయాయి. అటువంటి వాటి స్ధానంలో కొత్త నిర్మాణాలు చేయాలన్న ఉద్దేశ్యంతో టిటిడి వాటిని కూలగొడుతోంది. అటువంటి నిర్మాణాల విషయంలోనే కేంద్రానికి ఫిర్యాదులు అందాయట.
ఆభరణాల సంగతేంటి ?
చరిత్ర ఆధారంగా చూస్తే వందల కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఎందరో టిటిడికి బహూకరించారు. అటువంటి వాటిలో రాజుల కాలం నుండి అందిన విలువైన ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. ఆభరణాలను భద్రపరిచేందుకు ప్రత్యేకంగా టిటిడిలో ఓ విభాగమే ఉంది. అలాగే, భక్తులు సమర్పించుకునే కానుకలు, నగదు తదితరాలను లెక్కించేందుకు, భద్రపరిచేందుకు టిటిడి రికార్డులను మెయిన్ టైన్ చేస్తోంది. ఆ విషయంలో కూడా ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు అందిదట. అందుకనే ఆ వివరాలను కూడా అందించాలని పురావస్తుశాఖ టిటిడిని ఆదేశించింది.
టిటిడిపై కేంద్రం కన్నేసిందా ?
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిటిడి నుండి అన్నీ వివరాలు తీసుకున్న తర్వాత ఆలయ నిర్వహణలో రాష్ట్రప్రభుత్వం విఫలమైందని ముద్ర వేసి తన ఆధీనంలోకి తీసుకోవటానికి కేంద్రం కొత్తగా ఎత్తులు వేస్తోందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. టిటిడిలో అవకతవకలు జరగటం, నిర్మాణాలు కూల్చి కొత్తవి కట్టడమన్నది ఇపుడే కొత్త కాదు. దశాబ్దాల తరబడి జరుగుతూనే ఉంది. అటువంటిది హటాత్తుగా ఇపుడే తిరుమలపై కేంద్రం ఎందుకు కన్నసిందో అర్దం కావటం లేదు. పైగా ఆలయాలకు, నిర్మాణాలకు, చారిత్రక ఆభరణలకు భద్రత కరువైందని కేంద్ర భావించటమేంటో అర్ధం కావటం లేదు.
వ్యూహాత్మకంగా పురావస్తు శాఖ అడుగులు
అందిన ఫిర్యాదులపై పురావస్తు శాఖ దర్యాప్తు కూడా మొదలుపెట్టింది. తమ దర్యాప్తు పూర్తయిన తర్వాత టిటిడి ఆలయాల విషయంలో ఏమి చేయాలో నిర్ణయం తీసుకుంటామని శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు. అంటే, జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే టిటిడిని కేంద్రప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని నిర్ణయించిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.