కర్నాటక ఎన్నికల్లో ఆధిక్యతలను పరిశీలిస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రభావం ఏమీ ఉన్నట్లు కనబడలేదు. కేంద్రమంత్రివర్గం నుండి తర్వాత ఎన్డీఏలో నుండి టిడిపి బయటకు వచ్చేసిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్రమోడిపై చంద్రబాబు యుద్దం ప్రకటించిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ నేపధ్యంలోనే కర్నాటక ఎన్నికలు వచ్చాయి. దాంతో కర్నాటకలో బిజెపిని దెబ్బ కొట్టాలని చంద్రబాబు అనుకున్నారు.
ఎందుకంటే, సుమారు 10 కోట్ల మంది ఓటర్లలో తెలుగు ఓటర్లు సుమారు 70 లక్షల మంది ఉన్నారు. అందులోనూ హుబ్లీ, ఉడిపి, బెంగుళూరు నగరం, హోసూరు, తుముకూరు, మైసూరు లాంటి ప్రాంతాల్లో తెలుగు ఓటర్లు ఎక్కువుగా ఉన్నారు. కాబట్టే పార్టీల గెలుపోటముల్లో తెలుగు ఓటర్లదే నిర్ణయాత్మక పాత్ర. ఆ విషయాలు బాగా తెలుసు కాబట్టే చంద్రబాబు కూడా బిజెపిని దెబ్బకొట్టేందుకు పెద్ద వ్యూహమే రచించారు. వ్యూహమైతే పన్నారు కానీ అంతిమ ఫలితాలను చూస్తుంటే రివర్స్ లో కనబడుతోంది.
![Image result for bjp](https://timesofindia.indiatimes.com/photo/56661289.cms)
బిజెపికి వ్యతిరేకంగా కప్టపడిన మంత్రులు :
కర్నాటకలో ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి బిజెపికి వ్యతిరేకంగా తెలుగుదేశంపార్టీ ప్రచారంలో దృష్టిని బాగా కేంద్రీకరించింది. ముందుగా అనుకున్నట్లే పై ప్రాంతాల్లో చంద్రబాబు టైం టేబుల్ ప్రకారం టిడిపి నేతలను మోహరించారు. మంత్రులు, ఎంపిలు, ఎంఎల్ఏలతో పాటు పలువురు నేతలు క్యాంపు వేశారు.
ముఖ్యంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు చెందిన మంత్రులు, టిడిపి నేతలు బిజెపి వ్యతిరేక ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. కొందరు మంత్రులు బాహాటంగానే బిజెపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ పిలుపిచ్చారు. మరికొందరు మంత్రులు కాంగ్రెస్ కు అనుకూలంగా పనిచేసిన విషయం అందరికీ తెలిసిందే. ఏదేమైనా ఈరోజు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే కర్నాటకలోని తెలుగు ప్రజలు చంద్రబాబు పిలుపును ఏమాత్రం పట్టించుకున్నట్లు కనబడలేదు.
![Image result for andhrapradesh](https://s3.ap-southeast-1.amazonaws.com/cdn.deccanchronicle.com/sites/default/files/Andhra-Pradesh-NEW%20DC_7_1_1_3_2.jpg)
ఏపి పై కర్నాటక ఫలితాల ప్రభావం:
కర్నాటక ఎన్నికల ప్రభావం ఏపి రాజకీయాలపై పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది. అందుకనే టిడిపిలో ఆందోళన కనబడుతోంది. కర్నాటకలో ఓటర్లు బిజెపిని ఓడించాలని చంద్రబాబు అనేక సందర్భాల్లో చెప్పినా అక్కడి ఓటర్లు ఏమాత్రం పట్టించుకోలేదని తేలిపోయింది. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో పలువురు బిజెపి నేతలు చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని చేసిన ప్రకటనలను టిడిపి నేతలు గుర్తు చేసుకుంటున్నారు. కర్నాటక ఎన్నికలైపోగానే చంద్రబాబుకు చుక్కలు చూపిస్తామంటూ బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు చేసిన ప్రకటనను టిడిపి నేతలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు.
![Image result for tdp](http://images.indianexpress.com/2018/02/tdp3.jpg)
టిడిపిలో పెరుగుతున్న ఆందోళన :
ఫలితాల సరళిని గమనించిన తర్వాత టిడిపి నేతల్లో ఆందోళన పెరిగిపోతోంది. కర్నాటక ఎన్నికల్లో బిజెపి దెబ్బతినాలని టిడిపి నేతలు గట్టిగా కోరుకున్నారు. అందుకు తగ్గట్లే బిజెపికి వ్యతిరేకంగానే కాకుండా పలుచోట్ల కాంగ్రెస్ కు అనుకూలంగా కూడా బహిరంగంగా పనిచేశారు. ఇపుడదే టిడిపి నేతల కొంపముంచబోతోందా అన్న అనుమానాలు పెరిగిపోతోంది. ఎందుకంటే, కర్నాటకలో తమకు వ్యతిరేకంగా బహిరంగంగా పనిచేసిన టిడిపి నేతల విషయంలో బిజెపి ఉదాసీనంగా ఉండే అవకాశాలైతే లేదన్న విషయం స్పష్టం.
![Image result for chandrababu](https://www.hindustantimes.com/rf/image_size_960x540/HT/p2/2018/03/23/Pictures/picture-received-caption-provided-chandrababu-ruben-banerjee_43303bae-2e76-11e8-8732-87a46da2a8cc.jpg)
చంద్రబాబు ఆందోళన నిజమవుతుందా ?
చంద్రబాబే స్వయంగా ఊహిస్తున్నట్లుగా, భయపడుతున్నట్లుగా త్వరలో కేంద్రప్రభుత్వ సంస్దలు దాడులు నిర్వహిస్తాయా అన్న అనుమానాలు పెరిగిపోతోంది. ఇప్పటికే పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల్లో భారీ అవినీతి జరిగిందని బిజెపి నేతలు ఆధారాలతో సహా కేంద్రానికి ఫిర్యాదు చేశారు. పట్టిసీమలో సుమారు రూ. 400 కోట్ల అవినీతి జరిగిందని స్వయంగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తప్పు పట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
అంతేకాకుండా కేంద్రం నిధులు మంజూరు చేసిన అనేక పథకాల్లో కూడా పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు ఆ విషయాలను దృష్టిలో పెట్టుకునే తనపైనే కాకుండా, లోకేష్ తో పాటు పలువురు సీనియర్ నేతలపై కేంద్రం దాడులు చేయిస్తుందని స్వయంగా ఎన్నో సార్లు ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆందోళనే త్వరలో నిజమయ్యే అవకాశాలున్నాయా అన్న అనుమానాలు టిడిపి నేతల్లో మొదలయ్యాయి.