చంద్రబాబునాయుడును గద్దె దించటమే లక్ష్యంగా బారతీయ జనతా పార్టీ పావులు కదుపుతోందా ? అందుకు ఈమధ్య కర్నాటకలో అనుసరించిన వ్యూహాన్నే అమలు చేయాలని నిర్ణయించుకుందా ? క్షేత్రస్ధాయిలోను, టిడిపికి మద్దతుగా నిలిచే మీడియా సమాచారం ప్రకారం అవుననే సమాధానం వస్తోంది. కర్నాటక ఫార్ములా ద్వారా 2019లో అధికారంలోకి రాకపోవచ్చు. కానీ చంద్రబాను గద్దె దింపటమైతే ఖాయమని బిజెపి నేతలు భావిస్తున్నారు. అందుకే ఆ ఫార్ముల విషయంలోనే గట్టిగా నిలబడ్డారు. ఇపుడు ఈ ఫార్ములాను విజయవంతంగా అమలు చేయగలిగితే 2024 ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావచ్చన్నది బిజెపి వ్యూహం. అంటే, వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటులో తమ పార్టీది కీలక పాత్రగా ఉండాలని కోరుకుంటున్నారు. కర్నాటకలో ఇపుడు జెడిఎస్ పార్టీ పోషించిన పాత్ర లాంటిదన్నమాట. ఇంతకీ బిజెపి అనుసరించాలనుకుంటున్న ఫార్ములా ఏంటి ?
భావోద్వేగాలను రెచ్చ గొట్టటమేనా ?
ఓ పద్దతి ప్రకారం అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా ఒక వర్గం ఓటర్లను సంఘటితం చేయటం. ఉద్వేగభరితమైన అంశాలను ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మతపరంగా సున్నితమైన అంశాలను లేవనెత్తటం. వివాదాస్పద అంశాలను లేవనెత్తటం, తర్వాత అదే అంశంపై చర్చలు, సదస్సులు నిర్వహించటం ద్వారా జనాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను పెంచటమన్నదే కర్నాటక ఫార్ములా. ఇపుడదే రాష్ట్రంలో జరుగుతోందని అనుమానాలు మొదలయ్యాయి. తిరుమల శ్రీవారి సేవల్లో లోపాలు, ఆలయంలో శ్రీవారికి అలంకరించే కోట్లాది రూపాయల విలువైన వజ్రాభరణాలు మాయమయ్యాయని ప్రచారం, నిధి, నిక్షేపాల కోసం ఆలయంలో తవ్వకాలు జరిపారన్న ఆరోపణలు, ప్రచారం లాంటవి ఫార్ములాలో భాగమ అనే అంటున్నారు.
కర్నాటకలో ఏం జరిగింది ?
ఇటీవల జరిగిన కర్నాటక ఎన్నికల్లో అధికారం అందుకోలేకపోయినా ఎక్కువ సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే. ఒక్కసారిగా కర్నాటకలో బిజెపికి సీట్లు పెరగటానికి కారణమేంటి ? కోస్తా కర్నాటకలో బిజెపికి పెరిగిన బలం వల్లే సీట్లు పెరిగాయి. అక్కడ ఎలా బలపడిందంటే, మతపరమైన గట్టి పునాదులు వేయబట్టే అక్కడ బలపడింది. కోస్తా కర్నాటకలో బలపడటానికి బిజెపి ఏడాది క్రితమే పునాది వేసుకుంది. కోస్తా కర్నాటకలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉడిపిలో సుమారు 2 వేల మంది సాధు, సంతులతో విశ్వహిందు పరిషత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సదస్సులు, సమావేశాలు నిర్వహించటం మొదలుపెట్టింది. మైసూరును పాలించిన టిప్పు సుల్తాన్ హిందువులను అణిచివేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు, చర్చలు మొదలుపెట్టింది.
మత ఘర్ణణలకు అదే కారణమా ?
ఎప్పటి టిప్పు సుల్తాన్ ? ఎప్పుడు హిందువులను అణిచేశారు ? ప్రస్తుత కాలానికి టిప్పు సుల్తాన్ కాలానికి ఏమైనా సంబంధముందా ? ముస్లింలకు వ్యతిరేకంగా హిందువులను రెచ్చగొట్టటానికే బిజెపి ఆ పని చేయించింది. దాని ఫలితంగా పై ప్రాంతంలో జరిగిన మత ఘర్షణలు అందరికీ తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బిజెపికి మద్దతుగా అనేక మత సంస్ధలు రంగంలోకి దిగాయి. ప్రతీ సంస్ధ తరపున వేలాదిమంది కార్యకర్తలు నెలల తరబడి కోస్తా కర్నాటకలోనే తిష్ట వేశారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని ముస్లిం వ్యతిరేకులుగా మార్చారు. అందుకు గ్రామస్ధాయిలోని బూత్ కమిటిల నుండి తమ ఆపరేషన్ ను మొదలుపెట్టి విజయవంతమయ్యారు. చాపక్రింద నీరులాగ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచుతూనే తర్వాత కేంద్రమంత్రులు, ఆ తర్వాత జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తో ప్రచారం చేయించారు. చివరగా ప్రధానమంత్రి నరేంద్రమోడిని రంగంలోకి దింపారు.
ఏపి, తెలంగాణాలో పాగా ?
ఇపుడు తెలంగాణా, ఏపిల్లో కూడా అదే ఫార్ములాను అనుసరించాలన్నది బిజెపి వ్యూహంగా కనబడుతోంది. ఇప్పటికే ఏపిలోని గ్రామస్ధాయిల్లో 23 వేల బూత్ కమిటిలను బిజెపి నియమించింది. మరో 15 వేల కమిటిల ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే ఆగస్టు నెలాఖరుకు మొత్తం బూత్ కమిటీల ఏర్పాటును పూర్తి చేయాలని అమిత్ షా ఆదేశించారు. ప్రతి కమిటిలోను సుమారు 15 మందుంటారు. అంటే సుమారు దాదాపు 38 వేల కమిటిల నుండే సుమారు
4.2 లక్షల మంది కార్యకర్తలుంటారు. వారందరికీ అవసరమైన శిక్షణను ఇప్పించటం ద్వారా ఓటర్లకు చేరువయ్యేందుకు మార్గ నిర్దేశం చేస్తారు. కాబట్టి మిగిలిన పార్టీలకన్నా బూత్ కమిటిల్లో బిజెపి బలంగా ఉంటుంది సహజంగానే. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బిజెపి అధకారంలోకి వచ్చినా రాకపోయినా చంద్రబాబుకు మాత్ర పొగ పెట్టటం ఖాయంగా కనిపిస్తోంది. మరి, బిజెపి ఫార్ములా ఎంత వరకూ తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుందో వేచి చూడాల్సిందే.