సరైన సమయం చూసి షాక్ ఇవ్వడం చంద్రబాబు కి అలవాటే. అందుకే తన సొంత సర్వేలతో పాటు, లగడపాటి పేరుతో వెలువడిన సర్వేలోనూ గంటాను ఓడించేసిన బాబు పని తీరు సాకు చూపి టిక్కెట్ ఎగొట్టేందుకు రంగం సిద్దమవుతోందని టీడీపీలో టాక్ నడుస్తోంది. గంటా ప్రాతినిధ్యం వహిస్తున్న భీమిలీలో ఎదురుగాలి అంటూ సర్వే చెప్పడం వెనక బాబు ఉన్నారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.
'మెగా'నుబంధంపై నిఘా !
టీడీపీలో మంత్రి అయినా మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో అనుబంధం మాత్రం గంటా శ్రీనివాసరావు కొనసాగిస్తూనే వున్నారు. ఓ వైపు జన సేనానిగా పవన్ కళ్యాణ్ బాబుని అమ్మనాబూతులు తిడుతున్నా గంటాకు ఏ మాత్రం పట్టలేదు. తాజాగా విశాఖ వచ్చిన మెగా మేనల్లుడు సాయిధర్మతేజ్ సినిమా కార్యక్రమానికి హాజరై మరో మారు తన మెగా భక్తిని చాటుకున్నారు. ఆ మీటింగ్ లో మెగా కుటుంబాన్ని పొగిడేసి మరీ తన ముచ్చట తీర్చుకున్నారు. అయితే దీనిని టీడీపీ పెద్దలు కూడా దేగ కళ్ళతో గమనించారట.
అయన కనుసన్నలలోనే
నిజానికి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర టూర్ అంతా మంత్రి గంటా కనుసన్నలలోనే సాగిందన్నది ఒపెన్ టాక్. అలా తమ పార్టీకి రాజకీయ ప్రత్యర్ధిగా ఉన్న పవన్ కు సహాయం చేయడాన్ని గంటా వర్గం కులం వంకతో సమర్ధించుకుంటోంది కానీ, తప్పు అనిపించకపోవడం విడ్డూరమే. మెగా కుటుంబం ఈ మధ్య కాలంలో తరచుగా సినిమా ఫంక్షన్లు విశాఖలోనే జరుపుకుంటున్నారు. అందుకు గంటా ప్రోత్సాహమే ప్రధాన కారణమట.
మనసు ఆ వైపేనా !
మనిషిగా గంటా టీడీపీలో వున్నా మనసు మాత్రం పవన్ జనసేన వైపే వుందంటున్నారు. ఎంత సేపు వైసీపి అధినేత జగన్ ని విమర్శించే మంత్రి గారు పవన్ ఏకంగా బాబుపై పెద్ద నోరు చేసుకుంటున్నా కిక్కురుమనకపోవడం వెనక సొంత ప్రయోజనలే వున్నాయంటున్నారు. బాబుని ఏకంగా వెన్నుపోటుదారుడు, అవినీతిపరుడంటూ పవన్ ఏకేసినా ఎమ్మెల్యేలు ఖండించారు తప్ప మంత్రి నోటి వెంట ఒక్క విమర్శ కూడా రాని విషయం అందరికీ తెలిసిందే. పరిస్థితి చూస్తూంటే గంటాకు బాబు మార్క్ షాక్ ట్రేట్ మెంట్ ఖాయమని, వచ్చే ఎన్నికలకు గంటా వేరే పార్టీని చూసుకోవాల్సిందేనంటూ సెట్టైర్లు పడిపోతున్నాయి..