15వ శతాబ్దానికి చెందిన గొప్ప కవి, సాధువు కబీర్‌దాస్. ఆయన బోధనలకు అటు హిందువులు, ఇటు ముస్లింలలోనూ ఆదరణ ఉండేది. రెండు మతాలకు చెందిన ప్రజలను ఆలోచింపజేసిన బోధకుడాయన.. ఇప్పుడు మోడీ నోట కబీర్ మాట వినిపించే అవకాశాలు ఉన్నాయి.. కబీర్ బాటలో మోడీ నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.. మోడీ కూడా సాధువులా మారుతాడని అనుకుంటున్నారా..? అదేం లేదు.. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. అందులోనూ ముందస్తు సందడి.. నెలకొంటున్న సందర్భంలో మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభించే ప్రాంతానికి.. కబీర్‌దాస్‌కు సంబంధం ఉంది. అందుకే ఇప్పుడు ఆ ప్రాంతం పేరు మళ్లీ వార్తల్లోకి వస్తోంది.
బీజేపీ అనగానే.. హిందువాదాన్ని భుజానికెత్తుకునే పార్టీ అని.. ప్రజల్లో బలమైన భావన ఉంది. ఇప్పటికీ ఆ పార్టీకి మైనారిటీల మద్దతు అంతంత మాత్రమే. ఒకసారి చరిత్రను పరిశీలిస్తే.. కబీర్‌దాస్ బాటను మోడీ ఎందుకు ఎంచుకుంటున్నారో మనకు తెలుస్తుంది.. ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సంత్ కబీర్ నగర్ జిల్లాలో లఖ్‌నవూకు సుమారు 250 కి.మీ.దూరంలో మగ్‌హర్ ఉంది. దీనినే నరక ప్రవేశ ద్వారం మగ్‌హర్ అని పిలుస్తారు. వారణాసిలో మరణిస్తే మోక్షం ప్రాప్తిస్తుందని, మగ్‌హర్‌లో మరణిస్తే నరకానికి వెళ్తారనే విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది.
అయితే, మగ్‌హర్‌లో మరణిస్తే నరకమే అన్న మూఢవిశ్వాసాన్ని పటాపంచలు చేయాలని నాడు కబీర్‌దాస్ అక్కడ తుదిశ్వాస విడవాలని నిర్ణయించుకున్నారు. 1515లో అక్కడికి వచ్చి 1518లో ఆయన తుదిశ్వాస విడిచారు. ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం నుంచే మోడీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 2014ఎన్నికల ప్రచారాన్ని వారణాసి నుంచి మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
కబీర్ దాస్ 500వ వర్ధంతి సందర్భంగా ఈ నెల 28న మగ్‌హర్లో జరిగే పలు కార్యక్రమాల్లో ప్రధాని మోడీ పాల్గొంటారు. ఇదే రోజు అక్కడ భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ సభ నుంచే ముందస్తు ఎన్నిలకు శంకారావం పూరించే అవకాశాలు ఉన్నాయని పలువురు నాయకులు భావిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా మోడీ ప్రభ మసకబారుతుందనే విషయం పలు సర్వేల్లో తేలింది. ఎన్నికల గడువు దాకా ఆగితే.. పార్టీకి మరింత నష్టం జరుగుతుందనే భావనలో పార్టీ అధిష్టానం ఉన్నట్లు సమాచారం.
ఈ నేపథ్యంలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. మళ్లీ ప్రజల మద్దతు పొందవచ్చుననే ఆలోచనలో మోడీ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నీతి ఆయోగ్ సమావేశంలోనూ ప్రధాని మోడీ ముందస్తు సంకేతాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే.. మగ్‌హర్ నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్న మోడీ అటు హిందువులు, ముస్లింలకు ఎంతవరకు ఆకట్టుకుంటారో చూడాలి మరి.