వచ్చే ఎన్నికల్లో ముగ్గురు నలుగురికి తప్ప సిట్టింగులందరికీ టికెట్లు ఇస్తామని టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట. ఇదే విషయాన్ని పలు సందర్భాలు, సమావేశాల్లో ఆయన చెప్పుకొచ్చారు. అంతేగాకుండా.. సెప్టెంబర్లోనే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తామని చెప్పినట్టుగానే.. ఆయన గురువారం మధ్యాహ్నం అసెంబ్లీని ఏకవ్యాఖ్య తీర్మానంతో రద్దు చేసిన తర్వాత సాయంత్రం విలేకరుల సమావేశంలోనే తొలి జాబితా విడుదల చేస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇంతలోనే ఓ పిడుగులాంటి వార్త కూడా బయటకు వచ్చింది. అదేమిటంటే.. వచ్చేఎన్నికల్లో టికెట్లు దక్కని ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతోందని. కేసీఆర్ చెప్పినట్టుగా ముగ్గురు నలుగురు కాకుండా.. ఆ జాబితాలో 24మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురు సిట్టింగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
నిజానికి.. 50రోజుల్లో 100 ప్రజా ఆశ్వీరాద సభలు నిర్వహించేందుకు టీఆర్ఎస్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే.. మొదట ఈనెల 7న ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా ఆశ్వీరాద సభతో ఎన్నికల శంఖారావం పూరించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారు. ఇక్కడే తొలి జాబితా ప్రకటిస్తారనే ప్రచారం జరిగింది. కానీ.. అంతకుముందే.. గురువారం సాయంత్రమే తొలిజాబితా విడుదల చేస్తారనే టాక్ వినిపిస్తోంది. అయితే.. ఒకరోజు ముందు ప్రకటించినా.. ఆ తర్వాత ప్రకటించినా... సీఎం కేసీఆర్ లెక్క తప్పుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 24మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కవనే టాక్ వినిపిస్తోంది. హుస్నాబాద్‌లో ప్రకటించే పేర్లలో ఇద్దరు ముగ్గురు సిట్టింగుల పేర్లు ఉండకపోవచ్చుననే టాక్ వినిపిస్తోంది.
హుస్నాబాద్ సభలో కేసీఆర్ మొత్తం 15 మంది అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తారంటున్నారు. ఈ రోజు తొలిజాబితా విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఎమ్మెల్యేలకు హైదరాబాద్‌కు రావాలని పిలుపు కూడా వచ్చినట్లు తెలుస్తోంది. మరో విషయం ఏమిటంటే.. టికెట్లు దక్కని సిట్టింగులకు సముచిత స్థానం కల్పిస్తామని పలుమార్లు సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు ముందుస్తుగానే.. వారికి సమాచారం అందించి, స్వయంగా వారితో మాట్లాడి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కేసీఆర్ పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. కానీ.. కేసీఆర్ మాటను పలువురు నేతలు మాత్రం లెక్క చేయరనీ.. రెబల్‌గానైనా బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నారని పార్టీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
ఏదేమైనా.. మూడు నెలలు నుంచి సాగుతున్న ముందస్తు ఎన్నికల ముహూర్తం రానే వచ్చింది. ఇక ఎంతమంది సిట్టింగులకు టికెట్లు దక్కుతాయో తెలియాలంటే కేసీఆర్ ప్రకటించే దాకా ఆగాల్సిందే. టిక్కెట్లు రాని వారిలో వరంగల్ జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాల నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది.