సొంత జిల్లా చిత్తూరులో త్వరలో చంద్రబాబునాయుడుకు షాక్ తప్పదా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరిలోను అదే అనుమానాలు మొదలయ్యాయి. తెలుగుదేశంపార్టీ నుండి త్వరలో వలసలు మొదలవ్వనున్నట్లు సమాచారం. తిరుపతి మాజీ ఎంఎల్ఏ , టిటిడి ట్రస్టు బోర్డు మాజీ ఛైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి తొందరలో పార్టీకి గుడ్ బై చెప్పనున్నారట. జిల్లాలో ప్రధానంగా తిరుపతిలో ఇదే విషయమై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
ఈ మధ్యే చదలవాడ హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కల్యాణ్ కలిశారు. నిప్పు లేందే పొగ రాదు కదా ? ఆ పద్దతిలోనే చదలవాడ త్వరలో జనసేన పార్టీలో చేరుతున్నరనే ప్రచారం మొదలైపోయింది. అందులోనూ చదలవాడ కాపు (బలిజ) సామాజికవర్గానికి చెందిన నేత కావటంతో ప్రచారం మరింత ఊపందుకుంది. ఇక్కడ ఓ విషయం గమనించాలి. అదేమిటంటే చదలవాడ ఆర్దికంగా బాగా స్దితిమంతుడు. సినిమా థియేటర్లు, పెట్రోలు బంకులు, డెంటల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ తదితర వ్యాపారాలున్నాయి.
వచ్చే ఎన్నికల్లో టిడిపి తరపున తిరుపతి ఎంఎల్ఏగా పోటీ చేసే అవకాశం చదలవాడకు దాదాపు లేనట్లే. ఎందుకంటే ప్రస్తుత ఎంఎల్ఏ సుగుణమ్మ కూడా బలిజ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే. పైగా ఆమె కూడా స్దితిమంతురాలే. సరే, ఆరోపణలంటారా ? ఎవరి మీద లేవు. అలాగే సుగుణమ్మ మీద కూడా ఏవో ఆరోపణలు వినిపిస్తునే ఉంటాయనుకోండి అది వేరే సంగతి. అన్నీ లెక్కలు భేరీజు వేసుకున్న తర్వాత కేవలం వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశ్యంతోనే చదలవాడ జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.