చంద్ర బాబు నేను ఏది చేసినా చారిత్రిక అవసరం అంటాడు. తెలంగాణ లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు ఆంధ్ర ఎన్నికల్లో ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ని సర్వనాశనం చేసిందంటూ పదేళ్ళపాటు చంద్రబాబు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు కాంగ్రెస్ పార్టీని. కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటేయమని, కాంగ్రెస్ పార్టీని పాతరేయమనీ చంద్రబాబు 2014 ఎన్నికల సమయంలో పిలుపునిచ్చారు.
ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని గెలిపించమని కోరుతున్న చంద్రబాబు, కాంగ్రెస్ గెలుపు 'చారిత్రక అవసరం' అంటూ కొత్త పల్లవి అందుకున్నారు. చంద్రబాబుకి అన్నీ చారిత్రక అవసరాలే మరి.! స్వర్గీయ నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఉద్దేశ్యమేంటి.? ఆయన్ని రాజకీయంగా వెన్నుపోటు పొడిచాక, టీడీపీని లాక్కున్న చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నదేంటి.?
తెలుగు ప్రజలంటే, తెలుగు రాష్ట్రాల్లోనివారే కాదు.. ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో వుంటోన్న, భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో వుంటోన్న తెలుగువారు కూడా.! ఆంధ్రప్రదేశ్‌లో ఏదన్నా రాజకీయ కార్యక్రమం చేపడితే, 'తెలుగు ప్రజల అభివృద్ధి కోసం..' అనడం చంద్రబాబుకి అలవాటే. తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తుకీ అదేమాట చెబుతున్నారాయన. చంద్రబాబు ఉద్దేశ్యం తెలుగు ప్రజలంటే.. తెలుగు తమ్ముళ్ళని తప్ప, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కాదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, బీజేపీతో టీడీపీ జతకట్టినా.. కాంగ్రెస్‌తో టీడీపీ జతకట్టాలనుకుంటున్నా.. అవన్నీ టీడీపీకి 'చారిత్రక అవసరాలు' తప్ప, తెలుగు ప్రజలకి కానే కాదని ఎప్పుడో తేలిపోయింది.