టీడీపీ అధినేత చంద్రబాబును రాజకీయ విశ్లేషకులు చాణక్యుడితో పోలుస్తారు. ఆయన రాజకీయంగా వేసే ఎత్తులు కూడా అలాగే ఉంటాయి. తెలంగాణ ఎన్నికల విషయంలోనూ ఆయన అలాంటి ఎత్తుగడలు చాలా వేశారు. అందులో కూకట్ పల్లి అభ్యర్థి ఎంపిక ఒకటి. ఇక్కడ అనూహ్యంగా నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినిని బరిలో దింపడం ద్వారా ఆసక్తికరమైన పోరుకు తెర తీశారు.
నందమూరి సుహాసినిని ఎంపిక చేయడం ద్వారా నందమూరి సెంటిమెంట్ తో కూకట్ పల్లి స్థానాన్ని టీడీపీ సులభంగా గెలుచుకుంటుందని చంద్రబాబు అంచనా వేశారు. అలాగే.. ప్రచారానికి సుహాసిని సోదరులైన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ తప్పకుండా వస్తారని.. దాని ప్రభావం గ్రేటర్ హైదరాబాద్ అంతటా ఉంటుందని అంచనా వేశారు. ఐతే.. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం చంద్రబాబు ఎత్తుగడను తిప్పికొట్టారు.
నందమూరి సుహాసిని తరపున ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చేది లేదని తేలిపోయింది. బుధవారం ప్రచారానికి ఆఖరి రోజు కావడం వల్ల ఇక ఆయన ప్రచారానికి రానట్టే. సొంత సోదరి ఎన్నికల బరిలో దిగినా జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడం చంద్రబాబు ఎత్తుగడలకు చెక్ చెప్పడమే అని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతానికి రాజకీయాలకు దూరంగా ఉండాలనుకున్న ఎన్టీఆర్ ను నందమూరి సుహాసినిని బరిలో దింపడం ద్వారా ప్రచారానికి రాక తప్పని పరిస్థితి కల్పించానని బాబు అనుకున్నారు. కానీ జూనియర్ మాత్రం చలించలేదు. అందులోనూ హరికృష్ణ మరణం సమయంలో కేసీఆర్, కేటీఆర్ చూపిన అభిమానం కూడా ఎన్టీఆర్ తాజా వైఖరికి కారణం కావచ్చు. ఏదేమైనా చంద్రబాబు ఎత్తుగడ మాత్రం ఫలించలేదు.