తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. దాదాపు గంటసేపు ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేసీఆర్ తెలంగాణకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారం కోసం మోడీతో మాట్లాడారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. మోడీని కేసీఆర్ దాదాపు 16 కోరికలు కోరారు.
కేసీఆర్ ఎప్పటి నుంచో కేంద్రాన్ని కోరుతున్న బైసన్ పోలో గ్రౌండ్ అప్పగింత మొదటి కోరిక. దీన్ని నూతన సచివాలయ నిర్మాణం కోసం కేటాయించాలని కోరారు. రెండోది కరీంనగర్ లో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేయాలని విన్నవించారు. మూడోది హైదరాబాద్ లో ఐఐఎం ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇక తెలంగాణలో కేసీఆర్ జిల్లాల సంఖ్యను 33కు పెంచారు. కానీ ఉమ్మడి జిల్లాల ప్రకారమే కేంద్రం ఆధ్వర్యంలో నడిచే జవహర్ నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. కొత్త జిల్లాల్లోనూ ఈ జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని కేసీఆర్ మోడిని కోరారు. ఇది నాలుగో కోరిక.
ఇక ఐదో కోరిక హైదరాబాద్ లో ఐఐఎస్ఈఆర్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ఇవీ కేసీఆర్ కోరిన ఐదు ప్రధానమైన కోరికలు.. వీటితో పాటు ఆదిలాబాద్ లో సిమెంట్ కార్పొరేషన్ అఫ్ ఇండియా కర్మాగారం ఏర్పాటు, జహీరాబాద్ లో నిమ్జ్, వరంగల్ లో కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ అభివృద్ధి వంటి కోరికలూ కోరారు. వీటితో పాటు కృష్ణా నదీ జల వివాదాలను వెంటనే పరిష్కరించాలని... కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి గ్రాంటు రూపంలో నిధులు కేటాయించాలనీ విజ్ఞప్తి చేశారు.