అహంకారం నెత్తినెక్కి కూర్చోగా మనసంతా అధికారం వలన వచ్చిన మధం మత్తులో మూల్గుతుంది. గత సంవత్సరకాలంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ నుండి రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ వయా తెలంగాణా సీఎం కేసీయార్ వరకు అందర్ని నోటి కొచ్చినట్లూ ధూషిస్తూ కాలం గడిపిన ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఇప్పుడు రాజ్యాంగాధికారం చేతికివస్తే అధికార వ్యవస్థ ఎలా కొరడా ఝుళిపిస్తుందో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నుండి ఎదురవటంతో భరించలేని తామసం తో “ధికారమున్ సైతునా!...” అన్నట్లు అనేక రకాలుగా పెడబొబ్బలు పెడుతున్నాడు.
సూటిగా చెప్పాలంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విషయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ఉన్నారు! సాధారణంగా ఒక ముఖ్యమంత్రి ని ధిక్కరించి సీఎస్ ఇలా మాట్లాడటం, వ్యవహరించడం ఊహించలేము. సీఎస్ హోదాలో ఉన్న వారెవరైనా సాధారణంగా ముఖ్యమంత్రి దగ్గర అణిగి మణిగే ఉంటారు.
సీఎస్ గా పదవీ కాలం ముగిసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న కొంత మంది తాము పని చేసిన ముఖ్యమంత్రుల మీద దుమ్మెత్తి పోస్తూ ఉండటాన్నిచూస్తూ ఉంటాం. అయితే సీఎస్ గా ఉండగానే సీనియర్ ఐఏఎస్ ఎవరూ ముఖ్యమంత్రి మీద పంచ్ లు వేసినట్టుగా మాట్లాడటం అధికార పార్టీ మీద హాట్ కామెంట్స్ చేయడం బహుశా! ఎప్పుడూ జరిగి ఉండలేదేమో. ఏపీలో ఇప్పుడు అలాంటిదే జరుగుతూ ఉంది!
సీఎస్ హోదాలో ఉన్న ఎల్వీ సుబ్రమణ్యం తెలుగుదేశం పార్టీల మధ్యన ఒక వార్ నడుస్తూ ఉంది. ఎల్వీ సుబ్రమణ్యం ఎలాంటి పరిస్థితుల్లో సీఎస్ గా వచ్చారో అందరికీ తెలిసిందే. ఏపీకి సీఎస్ గా ఉన్న సీనియర్ ఐఏఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేశాక ఎల్వీఎస్ ఆ బాధ్యతల్లోకి వచ్చారు. తీరా పోలింగ్ ముగిశాకా ఎల్వీఎస్ పై సీఎం చంద్రబాబు తీవ్రవ్యాఖ్యలు చేశారు. "ఆయనపై కేసులున్నాయని ఆయనను ఎలా సీఎస్ గా నియమించారు?" అని బాబు ప్రశ్నించారు. అయితే ఆ కేసులు ముగిసి అప్పటికే ఆయనకు క్లీన్ చిట్ వచ్చి ఉండటంతో, తన మాటలు తనకే అంటే చంద్రబాబుకే వ్యాఖ్యలు బ్యాక్-ఫైర్ అయ్యాయి.
అంతేకాదు అవి సహజంగా సౌమ్యుడైన ఎల్వీఎస్ ను కఠినాత్ముడుగా మార్చేశాయి. అక్కడ నుంచి అసలు వేడి మొదలైంది. అసలే తాను చేయని నేఱానికి సీబీఐ విచారణ లు ఎదుర్కొని ఉన్న ఎల్వీఎస్ కు చంద్రబాబు వ్యాఖ్యలు అంతరాల్లో అగ్గి రాజేశాయి.
ఇటీవల చంద్రబాబు నాయుడు వివిధ శాఖల సమీక్షలు నిర్వహించడంపై సీఎస్ తన కున్న అధికార కొరడా ఝుళిపించారు. అలాగే స్పందించారు. చంద్రబాబుతో సమీక్ష ల్లో పాల్గొన్న అధికారులకు నోటీసులు జారీ చేసి అగ్నికి ఆజ్యం పోశారు. దీంతో మళ్లీ చంద్రబాబు సమీక్షలు అనే మాట ఎత్తకుండా చేశారు ఎల్వీ సుబ్రమణ్యం. డైరెక్టుగా అధికారులకే నోటీసులు ఇవ్వడం తో మళ్లీ అధికారులు ఎవరూ చంద్రబాబుతో సమీక్షలకు హాజరు అయ్యే ధైర్యం చేయరు సరి కదా! చంచాగాళ్ళకు చెమటలు పట్టాయి. ఇక అంతటితో కూడా ఆగలేదు సీఎస్, ఒక పత్రికతో ఆసక్తిదాయకమైన వ్యాఖ్యలు చేశారు.
'జూన్ ఎనిమిది వరకూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంటుందని అనడానికి లేదు. ఒకవేళ ఎన్నికల్లో వారు గెలిస్తే వారే కొనసాగవచ్చు. అలా కాకుండా వైసిపి గెలిస్తే మే ఇరవై మూడునే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాల్సి ఉంటుంది..' అని ఎల్వీ సుబ్రమణ్యం వ్యాఖ్యానించారు. అందులో ఆశ్చర్యకరమైన అంశం ఏమీ లేకపోయినప్పటికీ 'జూన్ ఎనిమిది వరకూ అధికారం మాదే' అంటున్న టీడీపీ వాళ్లకు ఆ మాటలు ఇబ్బందికరంగా మారాయి.ఇవన్నీ పైకి కనిపిస్తున్నవి. ఇక సీఎస్ సమీక్షలు నిర్వహిస్తూ వివిధ శాఖల వ్యవహారాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇది బాబు కేబినెట్ మంత్రులకు ససేమేరా నచ్చడం లేదు.
ఈ విషయంలో యనమల బహిరంగంగానే ఫైర్ అయ్యారు. మరోవైపు సమీక్షలు నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేసేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అసంతృప్తి వెళ్ళగక్కుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పై దుమ్మెత్తి పోస్తూ వైసిపి ఫిర్యాదులకు విలువనిస్తున్నారంటూ, తనకు సమీక్షలు నిర్వహించే అధికారం ఇవ్వాలంటూ చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు.
అయితే కోడ్ అమల్లో ఉందనే ఏకైక రీజన్ తో చంద్రబాబు లేఖను సీఈసీ పక్కన పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇదే సమయంలో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఢిల్లీ పర్యటన ఆసక్తి దాయకంగా మారింది. కృష్ణానదిలో అక్రమ తవ్వకాలు కట్టడాల విషయం లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ విచారణకు ఆయన ఢిల్లీ పర్యటన అంటున్నా అక్కడ ఆయన కేంద్రంలోని పెద్దలను ఎవరినైనా కలవబోతున్నారా? అనేది చర్చనీయాంశంగా ఆసక్తి దాయకమైన అంశంగా మారింది.
మొత్తానికి పలితాలు రాకుండానే చంద్రబాబు (సీఎం) వర్సెస్ ఎల్వీఎస్ (సీఎస్) పోరాటం రసవత్తరంగా సాగుతోంది. ఫలితాలు వచ్చే వరకూ ఈ వ్యవహారం ఇంకా ఎలా సాగుతుందో! చూద్ధాం!