నవ్యాంధ్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈనెల 30న వైయస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి దూరంగా ఉండాలని తెలుగు దేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. తాను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న తరుణంలో తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు వైసీపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్, ఇతర కీలక నేతలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలను కోరారు.
అయితే ఆ సమయంలో నారా చంద్రబాబు నాయుడు వేరే కార్యక్రమాల్లో మునిగి ఉండటంతో ఫోన్ లో మాట్లాడలేక పోయారు. ఆ తర్వాత వైసీపీ కేంద్రకార్యాలయం చంద్రబాబుకు ఫోన్ చేసి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాల్సిందిగా ఆహ్వానించారు. అయితే గత అనుభవాల దృష్ట్యా వైయస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కాకూడదని చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. 2014 లో తాను ముఖ్యమంత్రిగా చేస్తున్న ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరేందుకు ప్రయత్నించగా వైయస్ జగన్మోహనరెడ్డి అందుబాటులో లేకుండా పోయారు.
అంతే కాదు కనీసం వైసీపీ ప్రతినిధి బృందాన్ని సైతం పంపలేదు. ఇకపోతే అత్యంత ప్రతిష్టాత్మకమైన అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపనకు కూడా హాజరు కావాలని మంత్రుల బృందం వైయస్ జగన్మోహనరెడ్డి నివాసమైన లోటస్ పాండ్ కు వెళ్లింది. అయితే మంత్రుల బృందాన్ని కలిసేందుకు వైయస్ జగన్మోహనరెడ్డి నిరాకరించారు.
ఈ పరిణామాలను గుర్తుకు తెచ్చిన టీడీపీ శ్రేణులు వైయస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరు కావొద్దని నిర్ణయించారు. అంతేకాదు జగన్ పై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, కార్యకర్తలు తొందరపడొద్దని చంద్రబాబు కార్యకర్త లకు దిశానిర్దేశం చేశారు.
తాజాగా తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కు సైతం వైయస్ జగన్ ఫోన్ చేసి తన ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కావాల్సిందిగా కోరారు. ఈ నేపథ్యంలో స్టాలిన్ జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు వస్తున్నట్లు డీఎంకే పార్టీ వర్గాలు తెలిపాయి. గురువారం ఉదయం ఆయన విజయవాడ చేరుకుంటారని తెలిపాయి.