నేటి మంచిమాట.. మన జీవితంలో ఆకలి కడుపు, ఖాళీజేబు, విరిగిన మనసు నేర్పినన్ని పాఠాలు ఎవరూ నేర్పలేరు. ఆకలి కడుపు, ఖాళీజేబు, విరిగిన మనసు జీవితంలో ఎన్నో గొప్ప పాఠాలను నేర్పిస్తాయి. చాలా సందర్భాల్లో మనం తినే అన్నాన్ని రుచి బాగోలేదనో, ఇతర కారణాల వల్లో వేస్ట్ చూస్తూ ఉంటాం. కానీ ఏదైనా కారణాల వల్ల ఒక్క పూట ఆకలితో అలమటిస్తే ఆకలి భాదేంటో అర్థమవుతుంది.
ఆకలి కడుపు జీవితంలో ఆహారం యొక్క విలువను తెలియజేస్తుంది. దేశంలో ఆకలితో అలమటిస్తున్న కోట్లాదిమంది పేదవారి బాధ, ఆవేదన అర్థమయ్యేలా చేస్తుంది. చాలా మంది డబ్బు చేతికి అందగానే విచ్చలవిడిగా ఖర్చు చేస్తుంటారు. వ్యర్థమైన పనులకు డబ్బును ఖర్చు పెడుతూ ఉంటారు. అలాంటివారు జీవితంలో ఊహించని కష్టం వచ్చిన సమయంలో డబ్బు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు.
చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో కష్టాల్లో ఉంటే ఆ బాధ వర్ణణాతీతం. అందువల్ల డబ్బును ఎల్లప్పుడూ అవసరం మేర ఖర్చు చేస్తూ మిగిలిన డబ్బును పొదుపు చేయాలి. జీవితంలో చాలా సందర్భాల్లో నమ్మిన వారే ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో మనస్సు విరిగిపోతుంది. అప్పటివరకూ వారిని నమ్మి జీవితంలో చేసిన పొరపాట్లు, తప్పులు గుర్తొస్తాయి. ఇంకోసారి ఇతరులను నమ్మే విషయంలో జాగ్రత్త పడేలా చేస్తాయి. మన జీవితంలో ఆకలితో ఉన్న సమయంలో ఆహారం దొరకకపోయినా, కష్టాల్లో ఉన్న సమయంలో చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, ఎవరి ప్రవర్తన వలనైనా మనసు విరిగిపోయినా ఆ సందర్భాలు జీవితంలో మనకు ఎన్నో గొప్ప పాఠాలను నేర్పిస్తాయి.