ఎవరైనా ఇద్దరు మనుషులు ఎందుకు మాట్లాడుకుంటారు.. తమ భావాలు పంచుకోవడానికి.. అంతే కదా.. కానీ మీరు కాస్త జాగ్రత్తగా పరిశీలిస్తే.. మాట్లాడే ఇద్దరు వ్యక్తుల్లో ఇద్దరూ తమ భావాలు చెప్పడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అవతలి వ్యక్తి చెప్పేది వినడం కంటే.. తాము చెప్పదలచుకున్న దానిపైనే ఎక్కువ దృష్టి సారిస్తారు..

 


ఇది మానవ సహజం. కానీ.. ఇక్కడే  ఓ వ్యక్తిత్వ సూత్రం ఉంది. ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు.. ఎవరైతే తాము మాట్లాడటం కంటే.. ఎదుటి వారి వాదన వినేందుకు ఆసక్తి చూపిస్తారో.. ఆ వినే వ్యక్తి పట్ల చెప్పే వ్యక్తి ప్రేమ పెరుగుతుంది. అభిమానం కలుగుతుంది. తాము చెప్పింది ఎంత జాగ్రత్తగా వింటున్నాడో అన్న భావన కలుగుతుంది. 

 


అయితే ఈ లక్షణం అలవర్చుకోవడానికి చాలా సహనం కావాలి. ఎవరికైనా తమ వాదన చెప్పడమే ప్రధానంగా ఉంటుంది. కానీ ఓపికగా ఎదుటి వారి వాదన విన్నవాడే అవతలి వ్యక్తి నుంచి మంచి మార్కులు కొట్టేస్తాడు. ఎవరైనా మనిషిని అర్థం చేసుకోవాలంటే... ముందు ఆ వ్యక్తి మనసును అర్థం చేసుకోవాలి.. అందుకు ప్రధాన మార్గం వారి మాటలు వినడమే. 

 


ఈ వినడం అనే అలవాటు నేర్చుకుంటే.. మనకు అవతలి వ్యక్తి గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. మానవ సంబంధాల్లో తరచుగా జరిగే పొరపాటు ఎదుటి వారు చెప్పేది సగం వినడం, అందులో సగం అర్థం చేసుకోవడం.. ఏం ఆలోచించకుండా దానికి పదిరెట్లు ప్రతిస్పందించడం. 

 


దీని ద్వారా అపార్ధాలు కలుగుతాయి. కాబట్టి మొదట ఎదుటివారు చెప్పేది విందాం.. దానిలో మనకు అవసరమైనంత మేరకు తీసుకుందాం.. ఆ తర్వాత మన అభిప్రాయం వినిపిద్దాం. అవతలి వారిని వారి మాటలను గౌరవించడం మంచిది. అప్పుడు వారు మనల్ని మన అభిప్రాయాలను గౌరవిస్తారు... ఇష్టం లేకపోతే నిశ్శబ్దం ఉత్తమం.

మరింత సమాచారం తెలుసుకోండి: