ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో మీలో ఒక మార్పు తీసుకురావాలని, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీ కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటుంది ఇండియా హెరాల్డ్.ఇటీవల కాలంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అన్ని రంగాలలోనూ, అన్ని విషయాలపై మీలో ఒక అవగాహన తీసుకురావడం కోసం ఇండియా హెరాల్డ్ ఎప్పుడూ తపిస్తూనే ఉంటుంది. ఇక అందులో భాగంగానే మీ కోసం ఒక మంచి మాటను మీ ముందుకు తీసుకొచ్చింది. అదేమిటంటే..అన్ని విషయాలను విధికే వదిలివేయడం మూర్ఖత్వం..!
దీని వివరణ ఏమిటంటే.. ఏమి కావాలన్నా మనం ప్రయత్నించకుండా ఏదీ జరగదు. కానీ అన్ని విషయాలను విధికే వదిలేయడం మూర్ఖత్వం అనిపించుకుంటుంది.. తలరాతను కూడా మార్చే శక్తి మనుషులకు వుంది. అలాంటప్పుడు ప్రయత్నించి, ఓడిపోయినా ఫర్వాలేదు కానీ, ప్రయత్నించకుండా ఉంటేనే చాలా నేరం.. కాబట్టి ఏ విషయాన్ని అయినా ముందుగా మనం కల్పించుకుని, ఆ విషయం కోసమే అవగాహన చేయాలి. లేదు విధి ఎలా ఉంటే అలా జరుగుతుంది అనుకుంటే మాత్రం ఎప్పటికీ సక్సెస్ ను సాధించలేరు అని దీని అర్థం.
ఉదాహరణకు మీకు ఒక కథ చెప్తాను.. ఒకానొక సరస్సు లో మూడు చేపలు ఉండేవి.. అందులో మొదటి చేప చాలా తెలివైనది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు బాగా ఆలోచించిన తర్వాత నే ఆ పని చేయడం మొదలు పెట్టేది. ఇక రెండవ చేప సమయస్ఫూర్తి తో, తెలివితో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండేది . ఇక మూడవ చేప ఎప్పుడు విధిని మాత్రమే నమ్మేది . ఒకరోజు మొదటి చేప సరదాగా సరస్సు ఒడ్డుకు వెళ్ళినప్పుడు, అక్కడ ఇద్దరు జాలర్లను చూసి మొదట ఆశ్చర్యపోయింది. ఆ తరువాత జాలర్లు రేపు ఈ చెరువులోని చేపలు అన్నింటినీ పడదామని మాట్లాడుకుంటున్న మాటలను విని ఆ చేప భయంతో మిగిలిన చేపలకు ఈ సమాచారాన్ని అందజేస్తుంది..
ఆ తర్వాత మొదటి చేప మిగతా చేపలతో మాట్లాడుతూ.. మనం ఇక్కడే ఉంటే ఆ జాలర్ల చేతుల్లో చిక్కడం ఖాయం . ఈ సరస్సు నుండి పిల్ల కాలువ ద్వారా వేరే సరస్సులోకి వెళ్లే మార్గం ఒకటుంది. దాని ద్వారా మనం ఆ సరస్సు లోకి వెళ్దాం అని చెప్పింది. ఇక రెండవ చేప ఈ సరస్సు నుండి వెళ్లిపోవడం నాకు ఇష్టం లేదు. జాలర్లు మనల్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు ప్రత్యామ్నాయంగా వేరొక ఐడియాను ఆలోచిద్దాం అని చెప్పి, అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక మూడవ చేప విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది అని అక్కడే ఉండిపోయింది. కానీ మొదటి చేప తను అనుకున్న లాగే ఆ సరస్సు నుంచి పిల్ల కాలువ ద్వారా మరొక సరస్సు లోకి వెళ్ళిపోయింది.
ఇక పథకం ప్రకారం ఆ జాలరులు మరుసటి రోజు చేపల పట్టుకోవడానికి వల విసిరారు. అందులో మిగిలిన రెండు చేపలు కూడా పడ్డాయి. ఇక రెండవ చేప సమయస్ఫూర్తి కలిగినది కాబట్టి చనిపోయినట్టు నటించింది. ఇక చనిపోయిన చేపలు ఆ జాలర్లు ఒడ్డుకు విసిరేశారు. ఆ చేప కూడా విసిరేసిన చేపలలో వుంది. ఇక నెమ్మదిగా కళ్ళు తెరిచి అక్కడి నుండి తిరిగి సరస్సులోకి జారుకుని తన ప్రాణాలను రక్షించుకుంది రెండవ చేప. ఇక మూడవ చేప మాత్రం ఏమీ చేయలేక అంతా విధిపై వదిలేసింది. చివరకు ప్రాణం విడిచింది.. కాబట్టి మన వంతు ప్రయత్నం చేయాలి. అప్పుడే జాగ్రత్త గా ఉండగలుగుతాము..