అనగనగా పూర్వకాలంలో ఒక ముసలావిడ ఉండేది. ఆమె ఇంట్లో ఒక రాగి బిందె , ఒక మట్టి కుండ ఉండేవి. రాగి బిందె ఏమో, ఎప్పుడూ మెరిసిపోతూ చూడడానికి అందంగా కనిపించేది. అందుచేత దానికి అంతులేని గర్వం ఉండేది. ఇక ఎప్పుడూ మట్టికుండను చాలా చిన్న చూపు చూసేది.
ఒకసారి అనుకోకుండా పెద్ద వరద వచ్చి ,ఆ ముసలమ్మ ఇంట్లోకి నీరు వచ్చి చేరింది. ఇంట్లో ఉండే చాలా సామాను, ఆ వరద నీటిలో కొట్టుకుపోయింది. అదృష్టం కొద్దీ ఆ రాగి బిందె, మట్టి కుండ మిగిలాయి. అవి రెండూ నీటిపై తేలియాడుతున్నాయి. అప్పుడు రాగి బిందె, మట్టికుండను చూసి నవ్వి.." ఏం? నా దగ్గరకి రాకూడదూ ? నీవు మట్టితో తయారైన దానివి, పైగా పెళుసుగా ఉన్నావు. నిన్ను నీవు రక్షించుకోలేవు. నీవు నా దగ్గరకు వస్తే నీకే బాధ ఉండదు. క్షేమంగా ఉండవచ్చు "అని అంది.
మట్టికుండ శక్తిహీనురాలే గానీ చాలా తెలివైనది. రాగిబిందె చెప్పిన మాటలకు మట్టికుండ ఒక చిన్న చిరునవ్వు నవ్వి," నన్ను రమ్మని పిలుస్తున్నందుకు ధన్యవాదాలు.. నీవు అన్నావు కదా! నేను మట్టితో చేసిన దాన్నని, శక్తిహీనురాలినని, పెళుసైన దాన్ననీ, కానీ ఒక్క పెద్ద కెరటం వచ్చిందంటే చాలు, ఇద్దరం ఒకరిని ఒకరు తగులుకొని నేను పగిలిపోతాను. అందుచేత మిత్రమా ! నేను ఒంటరిగా, క్షేమంగా ఉన్నాను ఇక్కడే వదిలేయి. దయచేసి నా వద్దకు రావద్దు".. అంటూ మట్టికుండ చెప్పింది..
చూసారు కదా ! కేవలం వస్తువులే కాదు.. మనుషులు కూడా అంతే. ప్రస్తుత కాలంలో పక్కవాడు బాగుపడితే ఓర్వలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎదుటివాడు ఏమైనా పర్లేదు , నేను బాగుంటే చాలు అనుకునే సమాజంలో బ్రతుకుతున్నాం మనం. కాబట్టి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని జీవించడం ఉత్తమం. అందుకే కొంచెం చెడు గా అనిపించినా , అలాంటి వారికి దూరంగా ఉంటూ మనం జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి..