అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు. వాళ్లకి కూర్చొని తినడం తప్పా ఏ పని చేతకాదు. ఇక వీళ్ళను చూసి, ఆ ముసలి తండ్రి రోజు కుమిలి పోసాగాడు. ఎలాగైనా సరే, ఏదో విధంగా వీళ్లకు బుద్ధి చెప్పి, వీళ్ళని ప్రయోజకులుగా తయారు చేయాలని అనుకున్నాడు ఆ రైతు.


ఇక అనుకున్నట్టుగానే, ఒక రోజున ఆ రైతు తన కొడుకులతో.. " నేను ఒక కుండలో బంగారు నాణాలు పోసి,  మన చేనులో ఒకచోట దాచి పెట్టాను. అయితే చాలాకాలం అయింది కదా ! నేను మరచిపోయాను. అందుచేత మీరు చేను నంతా బాగా త్రవ్వి, ఆ కుండను వెతికి పట్టుకొని రండి.." అని చెప్పాడు. ఇక మహా సంతోషంతో ఆ ముగ్గురు కొడుకులు పొలం దగ్గరికి చేరుకున్నారు. అతికష్టం మీద చేనునంతా త్రవ్వి చూశారు. కానీ వాళ్లకు ఆ కుండ కనిపించలేదు. ఇక తిరిగి వచ్చి, వాళ్ళు ఆ సంగతి తన తండ్రికి చెప్పారు.


ఇక తండ్రి..కొడుకులతో.. "కుండ పోతే పోయిందిలే ! మీరు చేనునంతా బాగా త్రవ్వారు కదా ! ఇప్పుడు కొన్ని విత్తనాలను తెచ్చి చేలో చల్లండి "అన్నాడు తండ్రి. ఇక కొడుకులు సరే అని వెళ్లి విత్తనాలు కొని తెచ్చి, చేను లో చల్లారు.  ఇక అదృష్టం కొద్దీ విత్తనాలు చల్లిన కొద్దిరోజుల్లోనే చక్కటి వర్షాలు పడ్డాయి. చాలా ఏపుగా పంట పెరిగింది. రైతు చేను వద్దకు వెళ్లి, పచ్చని వన్నెగల వెన్నులు అల్లాడుతుంటే చూసి మురిసిపోయాడు.

పంట చాలా బాగా పండింది.  బస్తాల కొద్ది ధాన్యం ఇంటికి చేరాయి. తినడానికి మిగిల్చి, మిగిలిన బస్తాలను బజార్లో అమ్మ వలసిందిగా కొడుకులను పురమాయించాడు ఆ తండ్రి..

ఇక ఆ రైతులు ధాన్యం అమ్మగా వచ్చిన మూడు వేల రూపాయలను తండ్రికి తెచ్చారు. అప్పుడు రైతు, కొడుకులతో ఇదే నేను చేలో పాతిన సొమ్ము. ఇట్లాగే మీరు ప్రతి సంవత్సరం కష్టపడి పని చేస్తే, మీకు బోలెడంత డబ్బు వస్తుంది. అప్పుడు సుఖంగా తినవచ్చు, నలుగురికి పెట్టవచ్చు అని చెప్పాడు.

అప్పుడు జ్ఞానోదయం అయిన రైతు పుత్రులకు, ఇక ఆనాటి నుండి ప్రతి సంవత్సరం వాళ్ళు కష్టపడి, పంటలు పండించి గొప్ప ధనవంతులు అయ్యారు. కాబట్టి కష్టపడితే ఫలితం తప్పకుండా లభిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: